Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల
నవతెలంగాణ-జనగామ రూరల్
ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ గడిబిడి చేస్తుండ్రు, గారడీ చేస్తుండ్రు అని రాసిన పాటను ప్రస్తుతం ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. సీఎం కేసీఆర్ రైతులను ప్రజలను గజిబిజిగా, గారడి చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా తొండి చేష్టలు చేస్తూ మొండిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బుధవారం స్థానిక కాంగ్రెస్ నియోజవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై, మరొకరు విమర్శలు చేసుకుంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు తాను 42మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానానికి విన్నవించామని, ప్రొఫెసర్ జయశంకర్ సార్ను కూడా ఢిల్లీకి తీసుకెళ్లామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు నిలిపేస్తే రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లులు, అందులో పనిచేస్తున్న కార్మికుల ఉపాధి ఏంటని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత భావం వ్యక్తమవుతోందన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న సీఎం కేసీఆర్ రైతుల కోసం ఏం చేశాడో తెలపాలని డిమాండ్ చేశారు. వేయి లారీల్లో ధాన్యాన్ని తరలించి ఇండియా గేటు ఎదుట, ప్రధాని ఇంటి ఎదుట పోస్తామని కేసీఆర్ చెబుతున్న విషయాన్ని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేయి లారీల్లో ధాన్యాన్ని తరలించి ప్రగతి ప్రగతి భవన్లో, కేసీఆర్ ఫాం హౌస్లో పోస్తామని హెచ్చరించారు. ఏడేండ్లుగా బీజేపీకీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించిన కేసీఆర్ మిత్రపక్షాలతో కలిసేందుకు మరో దొంగ నాటకానికి తెరతీశారని ఆరోపించారు. దేశ భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికీ పొన్నాల లక్ష్మయ్య కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగోజీ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిరా, జిల్లా నాయకులు ధర్మ సంతోష్ రెడ్డి, ఉడుత రవి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, మీడియా ఇంచార్జ్ పిట్టల సతీష్ తదితరులు పాల్గొన్నారు.