Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరీ 'బజ్జూరి'..?
దురాక్రమణదారుడికి నోటీసులు
రంగంలోకి ఇంటెలిజెన్స్ వర్గాలు
'నవతెలంగాణ' ఎఫెక్ట్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి విషయంలో ఎట్టకేలకు బల్దియా అధికారుల్లో కదలిక వచ్చింది. తాజాగా అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టిన బజ్జూరి మూర్తిరాజుకు నోటీసులు జారీ చేశారు. ఇంటి నిర్మాణం అనుమతులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సమర్పించాల్సిందిగా ఆదేశించారు. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారికి ఆనకుని ఉన్న రెండో ప్లాటునే బజ్జూరీ ఆక్రమించారు. ఆయనకు టీఆర్ఎస్ కీలక ప్రజాప్రతినిధితోపాటు అటు బల్దియా, రిజిస్ట్రేషన్ శాఖలతోపాటు ఇటు పోలీసు అధికారులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే పోలీసు శాఖలో కదలిక రాలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినా నేటికీ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. ఫోర్జరీ పత్రాలు సృష్టించి సేల్‌డీడ్ తయారుచేసి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ భూమికి సంబంధం లేని వ్యక్తి 'బజ్జూరి'కి రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. దీంతో రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న దందా బహిర్గతమైంది. ఇదిలావుంటే బల్దియా అధికారులు రిజిస్ట్రేషన్ శాఖలోనే మ్యుటేషన్ ఆటోమేటిక్‌గా అయిపోతుందని తమకేం సంబంధం లేదని చెబుతున్నారు. 'నవతెలంగాణ'లో మంగళవారం ప్రచురితమైన 'వరంగల్‌లో రౌడీల దందా-అక్రమంగా ఇంటి నిర్మాణం, తెర వెనుక అధికార టీిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధి' బల్దియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో బుధవారం ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగి కూపీ లాగి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సమాచారం. ఇదిలావుంటే బల్దియా అధికారుల వింత వాదనలు పలు సందేహాలకు తావిస్తున్నాయయి. 60 గజాల ప్లాటుకు ఇంత పెద్దగా రాస్తున్నారేంటి ? అని స్వయంగా ఏసీపీ బషీర్ ప్రశ్నించడం వెనుక భారీ అవినీతి ఉందనేది స్పష్టమవుతుంది.
వరంగల్ రంగశాయిపేటలో 60 గజాల స్థలాన్ని ఆక్రమించుకుని రౌడీల పహారాలో అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్న వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 'నవతెలంగాణ'లో మంగళవారం ప్రచురితమైన 'వరంగల్‌లో రౌడీల దందా-అక్రమంగా ఇంటి నిర్మాణం, తెర వెనుక అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి' అనే కథనం బల్దియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై బాధితుడు విలాసాగరపు ప్రభాకర్ ఫిర్యాదుతో మున్సిపల్ కమిషనర్ పి. ప్రావీణ్య సంబందిత అధికారులకు 24 గంటల్లోపు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదు. దీనికి అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి అడ్డుపడ్డట్లు సమాచారం. ఈ ప్రజాప్రతినిధి అండతోనే బజ్జూరి మూర్తిరాజు రౌడీల పహారాతో ఇంటి నిర్మాణం కొనసాగిస్తున్నాడు. అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్న వ్యక్తిని, అతనికి సహకరిస్తున్న రౌడీలను మిల్స్ కాలనీ పోలీసు అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్
బజ్జూరి మూర్తిరాజు బాధితుడు విలాసాగరపు ప్రభాకర్ అన్న విలాసాగరపు ఉప్పలయ్యతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం. ఈ దందాలో ఉప్పలయ్య కుమారుడు హరి కీలకపాత్ర పోషించాడు. తనకు తాను రౌడీనని చెప్పుకునే హరి ప్రభాకర్ భూమిని 'బజ్జూరి'కి అంటగట్టాడు. ఇందుకు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ భూమి విలాసాగరపు నర్సయ్య తన కుమారులకు పంచి ఇచ్చిన వారసత్వపు భూమి. నర్సయ్య సతీమణి సోమమ్మ జూలై 21, 2005లో తన కుమారుడు విలాసాగరపు ప్రభాకర్‌కు రిజిస్ట్రేషన్ చేసింది. ఈ డాక్యుమెంట్లో బజ్జూరి మూర్తిరాజుకు ఇదే భూమిని రిజిస్ట్రేషన్ చేసిన విలాసాగరపు ఉప్పలయ్య సాక్షిగా ఉండడమే కాకుండా సంతకం కూడా చేశారు. 2005 నుండి నేటి వరకు ఆ భూమిని ప్రభాకర్ ఎవరికీ అమ్మలేదు. ప్రభాకర్ ఉద్యోగరీత్యా హైద్రాబాద్‌లోనే వుండి రిటైర్ కావడం, అనంతరం కూడా ఆయన అక్కడే వున్నారు. దీంతో వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారికి రెండో ప్లాటు కావడంతో మార్కెట్ విలువ అధికంగా వున్న క్రమంలో ప్రభాకర్ అన్న ఉప్పలయ్య కుమారుడు హరి, బజ్జూరి మూర్తిరాజు కుమ్మక్కై ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ ప్లాటుకు విలాసాగరపు ఉప్పలయ్యకు సంబంధమే లేనప్పుడు, ఉప్పలయ్య ఎలా రిజిస్ట్రేషన్ చేస్తాడు ? అనేది కీలకాంశం. ఎలాంటి డాక్యుమెంట్లు లేని ఉప్పలయ్య రిజిస్ట్రేషన్ చేయడం వెనుక రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల అవినీతి లీలలు స్పష్టమవుతున్నాయి.
బల్దియా అధికారుల వితండవాదం..
రంగశాయిపేటలో అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్న బజ్జూరి మూర్తిరాజుకు నోటీసులు పంపినట్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏసీపీ బషీర్ 'నవతెలంగాణ'కు తెలిపారు. ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు, అనుమతులకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని కోరినట్లు చెప్పారు. నోటీసుల ప్రతిని ఇవ్వాల్సిందిగా కోరగా, గురువారం ఇస్తామని చెప్పడం గమనార్హం. బల్దియా అధికారుల వితండవాదం పలు అనుమానాలకు తావిస్తోంది. 60గజాల ప్లాటుకు ఇంత పెద్ద ఎత్తున రాస్తున్నారేమిటీ ? అంటూ ఏసీపీ బషీర్ ప్రశ్నించడం గమనార్హం. బిల్డర్ 'బజ్జూరి'కి బల్దియా, పోలీసు, రిజిస్ట్రేషన్ శాఖల్లో వున్న పట్టు దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఆయనకు ఈ మూడు శాఖలు మద్దతు పలకడంతో పనులు కొనసాగిస్తున్నారు. పైపెచ్చు 60 గజాల స్థలంలో ఇంటి నిర్మించుకోవడానికి అనుమతులు అవసరం లేదనేది బల్దియా అధికారుల వాదన. కాని దొంగ రిజిస్ట్రేషన్లతో మంది భూమిలో కట్టుకుంటే బల్దియా అధికారులకు, పోలీసులకు అవసరం లేదా ? అనేది ఆయా అధికారులు తేల్చి చెప్పాల్సిన అవసరముంది. దీనికి వివరణ ఇవ్వకపోతే ఈ మూడు శాఖలు అక్రమార్కులకు ఊతం ఇచ్చినట్టుగానే భావించాల్సి వుంటుంది.