Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
భవన నిర్మాణ, వలస కార్మికుల చట్టాలను రక్షించాలని, కార్మికులకు గుదిబండగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని బీసీడబ్య్లూ జిల్లా కార్యదర్శి టీ ఉప్పలయ్య డిమాండ్ చేశారు. గురువారం హన్మకొండ వడ్డేపల్లి చర్చి సమీపంలోని భవన నిర్మాణ కార్మికుల అడ్డాలో దేశవ్యాప్తంగా జరుగే భవన నిర్మాణ కార్మికుల 1996 చట్టాన్ని, 1979 వలస కార్మికుల చట్టాన్ని రక్షించాలని కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. కార్మికులు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కేంద్ర కార్మిక 29 చట్టాలు, 1996 నిర్మాణ రంగ కార్మికుల వెల్ఫేర్ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మందబలంతో నాలుగు లేబర్ కోడ్లగా మార్చేసి తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. నిర్మాణ రంగంలో పనిచేసే 54 రకాల మంది కార్మికులకు సమగ్ర చట్టాన్ని, 979 వలస కార్మికుల చట్టాన్ని రద్దు చేసిందని తెలిపారు. వెంటనే ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. నిర్మాణరంగ ముడి సరుకుల ధరలను తగ్గించాలన్నారు. వివిధ పథకాల కింద రాష్ట్ర వ్యాప్తంగా కార్మికలకు చెల్లించాల్సిన 37వేల పెండింగ్ క్లైమ్స్కు నిధులు విడుదల చేయాలన్నారు. నిర్మాణ, ఇతర రంగాల కార్మికులకు ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కార్మిక శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి దామెర సుదర్శన్, జిల్లా కమిటీ సభ్యులు లింగం కార్మికులు తదితరులు పాల్గొన్నారు.