Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కార్మికులకు గుదిబండగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతగిరి రవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 2, 3న భవన ఇతర నిర్మాణ కార్మికుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తహశీల్దార్‌కు గురవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. కార్మికులు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కేంద్ర కార్మిక 29 చట్టాలు, 1996 నిర్మాణ రంగ కార్మికుల వెల్ఫేర్ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మందబలంతో నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేసి తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. నిర్మాణ రంగంలో పనిచేసే 54 రకాల మంది కార్మికులకు సమగ్ర చట్టాన్ని, 979 వలస కార్మికుల చట్టాన్ని రద్దు చేసిందని తెలిపారు. వెంటనే ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. నిర్మాణరంగానికి ఉపయోగపడే ముడి సరుకుల ధరలను తగ్గించాలన్నారు. కార్మికులకు ఉపాధి కల్పించాలని లేనట్లయితే నెలకు రూ.10వేల జీవనభతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఒక్కో కార్మికుడికి ప్రకటించిన నెలకు రూ.15వేలను ఇప్పటికీ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. వెల్ఫేర్ బోర్డ్ నుండి రూ.1005 కోట్లను పౌరసరఫరా సంస్థకు దారి మళ్లించి తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. వెంటనే దారి మళ్లించిన నిధులను వెల్ఫేర్ బోర్డుకు జమ చేసి కార్మికుల సంక్షేమ పథకాలకు కేటాయించాలన్నారు. వివిధ పథకాల కింద రాష్ట్ర వ్యాప్తంగా కార్మికలకు చెల్లించాల్సిన 37 వేల పెండింగ్ క్లైమ్స్లకు నిధులను విడుదల చేయాలన్నారు. నిర్మాణ, ఇతర రంగాల కార్మికులకు ఈశ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కార్మిక శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు పటణాధ్యక్షుడు గుత్తుల వెంకన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు జినుకల సారంగం, ఉపాధ్యక్షులు దేవండ్ల రాంబాబు, ప్రధాన కార్యదర్శి లక్క సాయిబాబు, పసునూరి వెంకటేశ్వర్లు, భాష, కాలేష తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-పర్వతగిరి
ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గురువారం తహశీల్దార్ ఎస్కె మహబూబ్ అలీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం భవన, ఇతర నిర్మాణ కార్మికుల దేశవ్యాప్త సమ్మె (డిసెంబర్ 2, 3)లో భాగంగా రావుల రాజు అధ్యక్షత సమవేశం నిర్వహించగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) మండల కార్యదర్శి ఎండీ యాకూబ్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 వేల పెండింగ్ కేసులకు వెంటనే నిధులు మంజూరు చేయాలన్నారు. నిర్మాణ రంగ కార్మికుల అందరిని ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మాదాసి యాకూబ్ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ మండల నాయకులు సురేష్, సారయ్య, ఎండీ మైబెల్లీ, వెంకన్న. మాలకొండయ్య. తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-సంగెం
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ హక్కుల రక్షణ కోసం 1996 కేంద్ర చట్టం, 1979 వలస కార్మిక చట్టాలను రక్షించాలన్నారు. డిసెంబర్ 2, 3 తేదీలలో దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుపాకి రాజు, సీహెచ్ శోభన్ బాబు, కే సాంబయ్య, శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, జీ రాజు, సీహెచ్ రాజు, సమ్మయ్య, రైతు సంఘం నాయకుడు ఎండీ ఇస్మాయిల్, గోనె రామచందర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.