Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
ఏజెన్సీలో విద్యాకుసుమం విరబూసింది. మండలంలోని కాటాపూర్‌కు చెందిన పల్నాటి రామయ్య-సత్యమ్మ దంపతుల రెండో సంతానమైన మనోజ్ కుమార్ ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించి గ్రామ, మండల ప్రతిష్టను ఇనుమడింపజేశారు. చదువులతోనే జీవితంలో అభివృద్ధి సాధించగలమని ఆయన 'నవతెలంగాణ'తో స్పష్టం చేశారు.
మండలంలోని కాటాపూర్ గ్రామానికి చెందిన రామయ్య-సత్తమ్మ దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. పిల్లలను ఉన్నత విద్యావంతులు గా తీర్చిదిద్దాలనే కాంక్షతో రామయ్య దంపతులు అనేక వ్యయప్రయాసలకోర్చి రెండో కుమారుడైన మనోజ్ కుమార్‌ను చిన్నతనం నుంచే చదువుల్లో రాణించాలని మనసులో బలంగా నాటారు. ఈ క్రమంలో మనోజ్‌కుమార్ తల్లిదండ్రుల ఆశలు నిజం చేసేలా అంచెలంచెలుగా ఎదుగుతూ తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు.
పల్లె నుంచి రాజధానిలోని 'ఉస్మానియా' వరకు అడుగులు
మనోజ్‌కుమార్ కాటాపూర్‌లోని జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుకున్నాడు. అనంతరం హనుమకొండలో ఇంటర్మీడియెట్, డిగ్రీ (బీఎస్సీ) పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశారు. అనంతరం జాతీయ స్థాయిలో సీఎస్ఐఆర్-జేఆర్ఎఫ్ నెట్లో 50వ ర్యాంక్‌తో 2014లో పీహెచ్డీ ప్రవేశం సాధించాడు. ఉస్మానియా యూనివర్సిటీలో రసాయన శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ టి పార్థసారధి ఆధ్వర్యంలో పరిశోధన కొనసాగించారు. తన పరిశోధన కాలంలో మనోజ్‌కుమార్ ఏడు అంతర్జాతీయ జర్నల్స్ (పరిశోధన పత్రాలు)లు ప్రచురితమయ్యాయి. అందులో రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ (ఆర్ఎస్సీ), అమెరికన్ కెమికల్ సొసైటీ (ఏసీఎస్) మనోజ్‌కుమార్ పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించాయి. ఈ ఏడాది (2021) నవంబర్‌లో ఉస్మానియా వర్సిటీ అధికారులు మనోజ్ కుమార్‌కు డాక్టరేట్ పట్టా అందించి సత్కరించారు.
మనోజ్‌కుమార్‌కు అభినందనల వెల్లువ
చిన్నతనం నుంచి అవిశ్రాంతంగా కఠోర దీక్షతో చదువుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన సందర్భంగా మనోజ్‌కుమార్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. అతడి స్నేహితులు, గ్రామ స్తులు, బంధువులు, అధ్యాపకులు, మండల ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు మనోజ్‌కుమార్ పీహెచ్డీ సాధించి కాటా పూర్ ప్రతిష్టను రాష్ట్ర రాజధాని స్థాయిలో ఇనుమడింప జేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మనోజ్‌కుమార్ ను, అతడి తల్లిదండ్రులను అభినందించారు.
చదువులతోనే జీవితంలో అభివృద్ధి
విద్యారంగంలో రాణించేలా
సహకరిస్తా : మనోజ్‌కుమార్
చదువులతోనే జీవితంలో అభివృద్ధి సాధించగలము. విద్యారంగంలో రాణించడంలో ఎవరికైనా సహకరిస్తా. సమాజంలోని ప్రతిఒక్కరూ ఉన్నత విద్యావంతులుగా ఎదిగి వ్యక్తిగత, కుటుంబ, సమాజ పురోగతిలో భాగస్వాములు కావాలి. ప్రణాళికాయుతంగా చదివితే విద్యారంగంలో రాణించడం, ఉన్నత శిఖరాలు అధిరోహించడం కష్టమేమీ కాదు. దట్టమైన ఏజెన్సీలోని మారుమూల పల్లె (కాటాపూర్) నుంచి ప్రస్తానం ప్రారంభించి రాష్ట్ర రాజధానిలోని దేశ చరిత్రలో కీలకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ సాధించడం ఆనందంగా ఉంది.