Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొలాల్లో కానరాని వైనం
- అధికారుల నిర్లక్ష్యం నిదర్శనం
- రహదారులపై ధాన్యం ఉండడంతో ప్రమాదాలు
నవతెలంగాణ-తొర్రూరు
రైతులు పండించిన ధాన్యానికి సరైన ధర రావడానికి పంట తీసిన తర్వాత గింజలను ఆరబెట్టి తేమశాతం సరిపడా ఉండేలా చూడడం వ్యవసాయంలో ప్రధాన అంశం. డివిజన్లో రైతులు అధికంగా వరి, మొక్కజొన్న పంటలు సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. రైతులు వడ్లు, మొక్కజొన్న వచ్చాక వాటిలో సరైన తేమ శాతం తీసుకురావడానికి ఆరబెడతారు. గతంలో గ్రామాల్లో పెద్ద సైజు బండలు ఉండడంతో వాటిపై ఆరబెట్టే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అవి కనుమరుగయ్యాయి. దీంతో రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెడుతున్నారు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
లక్ష్యాన్ని చేరుకోని కల్లాలు
ప్రభుత్వం ముందుచూపుతో రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి పొలాల వద్ద కల్లాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అందుకయ్యే ఖర్చును ఈజీఎస్ కింద ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు తొర్రూరు మండలంలో 123 కల్లాలు మంజూరు కాగా 55 పూర్తి చేశారు. అలాగే పెద్దవంగర మండలంలో 113 మంజూరు కాగా 40 పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. వీటిలో 75 మీటర్ల కల్లానికి రూ.85 వేలు, 60 మీటర్ల కల్లానికి రూ.65 వేలు, 50 మీటర్ల కల్లానికి రూ.55 వేల చొప్పున ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఉపాధి హామీ పథకం కింద వీటిని నిర్మించుకునేలా యూనిట్లు మంజూరు చేసింది.
ముందు నిర్మాణం.. తర్వాతే డబ్బులు..
కల్లాల నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం ముందుగా రైతు భరించాలి. నిర్మాణం పూర్తయ్యాక అధికారులు రికార్డు చేసి బిల్లులు మంజూరు చేస్తారు. బిల్లుల మంజూరీలో ఆలస్యం అవుతుండడంతో రైతులు నిర్మాణానికి ముందుకు రావడం లేదు. దీంతో ప్రభుత్వం ఆశించిన ఫలితం కనబడడం లేదు.
రోడ్లపైనే ధాన్యం
కల్లాల నిర్మాణం ఆశించినంతగా లేకపోవడంతో రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రోడ్డులనే కల్లాలుగా మార్చుతున్నారు. తొర్రూరు జాతీయ రహదారికి ఇరువైపులా, పెద్దవంగర వెళ్లే దారిలో, అనేక గ్రామాల్లో రోడ్ల మీదే ధాన్యం ఆరబెడుతున్న పరిస్థితి నెలకొంది.
బిల్లులో ఆలస్యం : రవి, రైతు బొజ్జ తండా
ధాన్యం ఆరబెట్టడానికి కల్లాలు ఉపయోగపడతాయి. కానీ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు ఆలస్యం అవుతుండడంతో రైతులు ముందుకు రావడం లేదు. పథకంలో కొన్ని మార్పులు చేసి కల్లాల నిర్మాణం మరింత చురుకుగా చేపడితే రైతులకు బాధలు తప్పుతాయి.
రోడ్లపైనే ఉండాల్సి వస్తోంది : భూక్య తేజ, రైతు
ధాన్యం ఎండబెట్టడానికి సరిపడా కల్లాలు లేకపోవడంతో రైతులు రోడ్లపైనే ఆధారపడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ధాన్యం వద్దే ఉండి నేర్పాల్సి వస్తోంది. అలాగే రాత్రి సమయాల్లో ధాన్యం చోరీ కాకుండా కాపలా ఉండాల్సి వస్తోంది.
రైతులను చైతన్యవంతం చేస్తున్నాం : పార్థసారథి, ఈజీఎస్ అధికారి
కల్లాలను నిర్మించుకోవడానికి రైతులను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేస్తున్నాం. కల్లాల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నాం. కల్లాల నిర్మాణం పూర్తైన రెండు నెలల్లో మొత్తం బిల్లు చెల్లిస్తున్నాం.