Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు
- రైతులు దళారులను నమ్మొద్దు : హరి ప్రసాదరావు
నవతెలంగాణ-తొర్రూరు
తొర్రూరు డివిజన్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేర్చుకున్నారు. సాధారణ ధాన్యం జాతకం కనీస మద్దతు ధర క్వింటాకు రూ.1940లు ఉండగా 'ఏ' గ్రేడ్ రకానికి రూ.1960లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమయంలో పండించిన ధాన్యానికి మద్దతు ధర పొందడానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్ కాకిరాల హరి ప్రసాదరావు, అధికారులు రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అయన సూచనలు, సలహాల ప్రకారం.. రైతులు ఒక రకం ధాన్యాన్ని మరొక రకం ధాన్యంతో కలపొద్దు. పంట కోసిన తర్వాత ఆరబెట్టాలి. లేకపోతే గింజలు రంగుమారి నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉంది. ధాన్యం పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. ధాన్యంలో రాళ్లు, మట్టిగడ్డలు లేకుండా నేలమీద పరదాలు, టార్పాలిన్ షీట్లు వేసి వాటిపై కుప్పలుగా పోయాలి. పంటలో తాలు, పొల్లు, చెత్తాచెదారం లేకుండా తూర్పారబట్టాలి. నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఎలుకలు నాశనం చేయకుండా బస్తాల మధ్య జింక్ సల్ఫేట్ మాత్రలు, పురుగుల నివారణకు లీటరు నీటికి ఐదు మిల్లీలీటర్లు మలాథియాన్ మందును బస్త్రాలపై పిచికారీ చేయాలి. ధాన్యం ముక్కిపోయి, రంగు మారి నాణ్యత పడిపోకుండా తేమ బాగా తగ్గాకే బస్తాల్లో నింపి లాటుగా వేయాలి. రైతులు ధాన్యపు పంట నుంచి సుమారు కిలో ధాన్యం మచ్చు (శాంపిల్) కింద ప్రాథమిక పరిశీలన కోసం కొనుగోలు కేంద్రానికి ముందుగా తీసుకెళ్లి నాణ్యతా పరీక్ష అధికారికి చూపించి తగు సలహాలు పొందవచ్చు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో శాంపిల్ తీసుకున్న అధికారి ధాన్యం నాణ్యతకు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే కొనుగోలు కేంద్రానికి తరలించాలి. రైతు పంట పండించిన భూమి సర్వే నెంబర్, విస్తీర్ణం వివరాలు తెలియజేస్తూ అధికారి నుంచి గుర్తింపు పత్రం తీసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రానికి దాఖలు చేయాలి. దళారులు, మధ్యవర్తులు, కమీషన్ ఏజెంట్ల చొరబాటు లేకుండా నిర్వహించేందుకు నేరుగా పంట పండించిన రైతుకు ప్రభుత్వం గిట్టుబాటు ధర వర్తింప జేసేందుకు ఈ నిబంధనలు పాటించాలి. రైతులకు నాణ్యత ప్రమాణాలపై ఏమైనా సందేహాలుంటే సంబంధిత ఏఓ, ఏఈఓలను సంప్రదించాలి.
నాణ్యత ఇలా..
ధాన్యంలో రాళ్లు, ఇసుక వ్యర్ధాలు ఉండకూడదు. గడ్డి, చెత్త, కలుపు విత్తనాలు ఒక శాతానికి మించొద్దు. చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగులు పట్టిన ధాన్యపు గింజలు 5 శాతానికి మించొద్దు. పరిపక్వంగాను, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన ధాన్యపు గింజలు 3 శాతం లోపే ఉండాలి. తక్కువ శ్రేణి ధాన్యపు గింజలు 'ఏ' గ్రేడ్ రకంలో ఆరు శాతం మించకూడదు. తేమ 17 శాతం మించొద్దు.
దళారులను నమ్మి మోసపోవద్దు
కాకిరాల హరిప్రసాదరావు, పీఏసీఎస్ చైర్మెన్, డీసీసీబీ డైరెక్టర్
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించే రైతులు ఏమైనా సందేహాలుంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దళారులు, మధ్యవర్తులు, కమీషన్ ఏజెంట్లను నివారించేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రైతులు నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలి.