Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ కలెక్టర్ గోపి
- రైతన్నలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ప్రజాప్రతినిధి
నవతెలంగాణ-రాయపర్తి
యాసంగిలో వరికి బదులు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి అధిక లాభాలు గడించవచ్చని వరంగల్ కలెక్టర్ గోపి అన్నారు. బుధవారం స్థానిక రైతు వేదికలో పంట మార్పిడిపై రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వరి ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో డిమాండ్ తగ్గుతుందని తెలిపారు. మార్కెటింగ్ వ్యవస్థలో అధిక డిమాండ్ ఉన్న పల్లి, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమలు, పెసర్లు, ఆముదం, మినుము, పొద్దుతిరుగుడు, జొన్న వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అరుదైన పంటలైన డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు పండించినట్లయితే తక్కువ కాలంలోనే ఎక్కువ ఆర్థిక వద్ధి చెందవచ్చని పేర్కొన్నారు.
కోతుల బెడద నుంచి కాపాడాలి : రైతులు
సదస్సు కొనసాగుతున్న సమయంలో వరి పంట కాకుండా ఇతర పంటలు వేస్తే కోతుల బెడద నుంచి ఎవరు కాపాడతారని రైతులు అధికారులతో ఆవేదన వెళ్లబుచ్చుకున్నారు. సాగుచేసిన వరి ధాన్యాన్నే కొనడానికి ప్రభుత్వం ఆలస్యం చేస్తుందన్నారు. ఇతర పంటలు వేస్తే ఎక్కడ అమ్ముకోవాలని అధికారులను ప్రశ్నించారు. ముచ్చట్లు ఎవరైనా చెప్తారు కానీ కష్టపడేది మేము అంటూ రైతులు ఆవేదనతో మాట్లాడారు.
తదుపరి ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. రైతుల్లో 'తెలివిగల, తెలివితక్కువ గల' వారూ ఉంటారని రైతులను కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం ఆశ్చర్యానికి గురి చేసింది. కోతుల సంతాన ఉత్పత్తి తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని దాటవేసే సమాధానాలు చెప్పారే తప్ప రైతుల గోడును విని సరైన సమాధానాలు చెప్పడంలో ప్రజాప్రతినిధుల, అధికారుల విఫలం అయ్యారు. బీడు వారిన భూముల్లో బంగారు సిరులు పండించి మానవాళికి అన్నం పెట్టే రైతు ఎలా తెలివి తక్కువవాడు అవుతాడని స్థానికులు ప్రజాప్రతినిధి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అధిక లాభాలపై ఆశ లేకుండా, ప్రకతి విపత్తులను ఎదురించి దేశ భవితవ్యం కోసం నిస్వార్ధంగా వ్యవసాయం కొనసాగిస్తూ ఒక్కొక్క విత్తనపు గింజను కనుపాపల్లో దాచుకొని పుడమి తల్లి ఒడిలో చెమటను చింతిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నను కించపరిచిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసి పోవడం ఖాయమని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, ఏడీఏ కుమార్, తహసిల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీఓ కిషన్ నాయక్, ఎన్ఎఫ్ఎస్ఎం అధికారి సారంగం, ఏఓ వీరభద్రం, సర్పంచులు గారె నర్సయ్య, కందికట్ల స్వామి, ఎంపీటీసీ అయిత రాంచందర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.