Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వింటాకు సగటున 5 కిలోలు కట్
- మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులకు కుమ్మక్కు
- అన్నదాతల కష్టం దళారుల పాలు
నవతెలంగాణ-తొర్రూరు
చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అకాల వర్షాలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులకు మాయిశ్చర్, తాలు, మట్టి పెడ్డల పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు మరిన్ని కష్టాలు పెడు తున్నారు. ఎఫ్‌సీఐ నిబంధనల పేరుతో పౌరసరఫరాల శాఖ నాణ్యత విషయంలో వ్యవహరిస్తున్న కఠిన వైఖరి రైతులకు ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. తేమ 17 శాతం మించకుండా చూసుకోవడంతోపాటు తాలు, చెత్త ఒక శాతం, మట్టి పెళ్లలు ఒక శాతం, చెడిపోయిన రంగు మారిన ధాన్యం 5 శాతం మించి ఉండకుండా ఎఫ్‌సీఐ నిబంధనల సాకుతో కేంద్రాల్లో రైతులను తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారు. పగలం తా ఆరబెట్టి రాత్రికి కుప్పలు చేస్తే మళ్లీ వాతావరణం చల్లబడడంతో తేమశాతం మళ్లీ పెరుగుతోంది. చాలాచోట్ల టార్పాలిన్ షీట్ల కొరత రైతులను వేధిస్తోంది. రోజుకు 20 రూపాయల చొప్పున 4, 5 టార్పాలిన్లు అద్దెకు తెచ్చి కుప్పలపై కప్పుతున్నా తేమ శాతం తగ్గకపోవడం, ధాన్యం రంగు మారడం జరుగుతోంది. ఎలాగో ధాన్యాన్ని తూకం వేసిన క్వింటాకు కనీసం 5 కిలోల ధాన్యం తరుగు తీసేస్తున్నారు. మిల్లు వద్ద నాణ్యత పేరుతో మరో రెండు కిలోల తరుగు తీస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, రైతులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు.
సమస్యలు ఇలా..
ఒక బస్తాకు బస్తా బరువుతో కలుపుకొని 40 కిలోల 700 గ్రాములు తూకం వేయాలి. కానీ చాలా కేంద్రాల్లో 42 కిలోలపైగా తూకం వేస్తున్నారు. మిల్లులకు చేరాక క్వింటా మీద ఏకంగా ఐదు కిలోల కోత పెడుతున్నారు. గ్రేడ్ 'ఏ' రకం ధాన్యానికి రూ.1960లు చొప్పున క్వింటాకు తరుగు పేరుతో 5 కిలోలకు రూ.98లు రైతులు నష్టపోతున్నారు. వాస్తవానికి కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం చేరాక రైతులకు సంబంధం ఉండదు. కానీ అక్కడ నాణ్యతను సాకుగా చూపి తరుగుకు ఒప్పుకుంటేనే కాంటా పెడతామని మిల్లర్లు రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో మిల్లర్లు పెట్టిన తప్పుడు కండిషన్లకు ఒప్పుకోక తప్పడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిల్లు వద్ద అన్‌లోడింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. టార్పాలిన్ షీట్లు కిరాయి, మిల్లుల వద్ద వెయిటింగ్ చార్జీలు రైతులకు అదనంగా తడిసి మోపెడు అవుతున్నాయి.
ఒప్పుకుంటేనే కాంటా : తుకారాం, రైతు
పండిన ధాన్యాన్ని సెంటర్‌కు తీసుకొచ్చి నెల రోజులు అవుతోంది. కాంటాలు పెట్టడం లేదు. సంచికి రెండు కిలోల చొప్పున అధికంగా తూకం వేస్తున్నారు. తాలు, తేమ పేరిట తరుగుకు మిల్లర్లు చెప్పినట్లు ఒప్పుకుంటేనే కాంటాలు పెడుతున్నారు. లేదంటే తిరస్కరిస్తున్నారు.
కేంద్రాల్లో అధిక తూకం : కిషన్‌రావు, రైతు
కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన 40 వేల 700 కిలోల తూకం పెట్టకుండా రెండు కిలోల వరకు అదనంగా తూకం పెడుతున్నారు. రైతుల అ విద్యను ఆసరా చేసుకుని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇలా పెట్టకపోతే మిల్లుకు పోయి మళ్లీ వాపసు వస్తారు మీ ఇష్టమని రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో, మిల్లులో ఎక్కడా ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదు. 15 ఏండ్లుగా మట్టి కల్లాల్లేవు. ఆ పరిస్థితుల్లో ధాన్యంలో మట్టి ఎలా వస్తుంది..? తరుగు ఎలా తీస్తారో..? అధికారులు పర్యవేక్షించాలి.