Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సింహులపేట
రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు. మండలంలోని పడమటిగూడెం, నర్సింహులపేట గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఆరుతడి పంటలను, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొస్తే కోత ఉండదన్నారు. తేమ శాతం 17కు మించొద్దని, టోకెన్ పొందాలని సూచించారు. ధాన్యం విక్రయించిన తర్వాత రవాణా బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదేనని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు, టార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచామన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన రోజే రవాణా చేసేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అనంతరం పడమటిగూడెం గ్రామం వద్ద వేరుశనగ, పచ్చ జొన్న, రామన్నగూడెం వద్ద బొప్పాయి పంటను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. రైతులతో పంట సాగు తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మెన్ సమ్మెట రాము, వ్యవసాయ శాఖ అధికారి చత్రునాయక్, ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ, జెడ్పీ వైస్ చైర్మెన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మండల కోఆర్డినేటర్ మల్లారెడ్డి, తహసీల్దార్ ఇమ్మానియేల్, ఎంపీడీఓ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
దంతాలపల్లి : మండలంలోని గున్నేపల్లి శివారులోని కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో కలెక్టర్ శశాంక పాల్గొని మాట్లాడారు. రైతులు వరికి బదులు కందులు, పెసలు, మినుములు, శనిగలు, తదితర పంటలను పండించాలని సూచించారు. రైతులు మూస విధానంలో ఒకే పంటను పండించడం వల్ల మార్కెట్ ధరలు పడిపోవడంతోపాటు భూసారం తగ్గుతుందని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని రైతులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మెన్ నూకల వెంకటేశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ సంపెట రాము, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఛత్రునాయక్,ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మల్లారెడ్డి, తహసీల్దార్ అబిద్ అలీ, ఎంపీడీఓ గోవిందరావు, ఏఈఓలు దీక్షిత్, శిరీష, సందీప్ తదితరులు పాల్గొన్నారు.