Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాజాతరకు 3 వేల 845 బస్సులు
- ఆర్టీసీ ఆర్ఎం విజరుభాస్కర్
- నేడు ఆర్టీసీ పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-తాడ్వాయి
వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనున్న మేడారం మహాజాతర సందర్భంగా సందర్శకుల కోసం మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ (ఆర్ఎం) విజరుభాస్కర్ తెలిపారు. మండలంలో మేడారంలో ఆర్టీసీ అధికారులతో కలిసి బుధవారం ఆయన పర్యటించారు. తొలుత వనదేవతలను దర్శించుకుని పూజలు చేశారు. పూజారులు, ఎండోమెంట్ అధికారులు ఆర్టీసీ అధికారులకు ఆలయ సాంప్రదాయ ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మ వనదేవతలకు ప్రత్యేక మొక్కులు చెల్లించారు. అనంతరం మేడారం బస్టాండ్ ఆవరణలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం విజరుభాస్కర్ మాట్లాడారు. మేడారం మహాజాతరకు కోటిన్నరకుపైగా సందర్శకులు వచ్చే అవకాశందని, ఫిబ్రవరి 12 నుంచి 20 వరకు 3 వేల 845 ఆర్టీసీ బస్సులను నడుపుతామని చెప్పారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా బస్సులు నడపనున్నామని తెలిపారు. దేశ నలుమూలల నుంచి సందర్శకులు రానున్న నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. మహాజాతర సందర్భంగా సుమారు 20 లక్షల మంది ఆర్టీసీ బస్సుల ద్వారా రాకపోకలు సాగించనున్నట్టు అంచనా వేశామన్నారు. మొత్తం 99 ప్రత్యేక బస్సు పాయింట్ల నుంచి జనాన్ని మేడారానికి చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మేడారంలో బస్సుల పార్కింగ్, బస్సుల మరమ్మతులకు షెడ్డు, సిబ్బందికి వసతి, తాగునీటి, ఇతర సదుపాయాలతోపాటు ప్రయాణికులు తిరిగి వెళ్లే క్రమంలో విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. మేడారం ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంతంలో సీసీ కెమెరాలు బిగించి కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీవీఎంలు శ్రీదేవి, తోట శ్రీనివాసరావు, డివిజనల్ ఇంజనీర్ బుచ్చయ్య, ఏటూరునాగారం, తాడ్వాయి కంట్రోలర్ చల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.