Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇటుక బట్టీల ఎదుట నిరసన
నవతెలంగాణ-తొర్రూరు
మండలంలోని వెల్లికట్టెలో నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇటుక బట్టీలు ఏర్పాటు చేసిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అనుబంధ బీసీ సెల్ మండల అధ్యక్షుడు దీకొండ శ్రీనివాస్, టీఆర్ఎస్ అనుబంధ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ధీకొండ బాలకృష్ణ డిమాండ్ చేశారు. మండలంలోని ఆ గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఇటుక బట్టిలను సుదూర ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా దీకొండ శ్రీనివాస్, ధీకొండ బాలకష్ణ మాట్లాడారు. కార్మిక శాఖ అనుమతి లేకుండానే బట్టీలను నిర్వహిస్తున్నారని చెప్పారు. మైనింగ్, రవాణా, పర్యావరణ శాఖల అనుమతులు సైతం లేవన్నారు. బట్టీల వల్ల బూడిద, దుమ్ము, ధూళితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రయాణికులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించేలా బట్టీలు నిర్వహిస్తున్న క్రమంలో తహసీల్దార్ గతేడాది నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్టు గుర్తు చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సైతం నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారని తెలిపారు. అయినా స్థానిక పెద్దల సహకారంతో నిర్వాహకులు దర్జాగా బట్టీలు నడుపుతున్నారని మండిపడ్డారు. పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ ఘటనా స్థలికి చేరుకుని మాట్లాడారు. గ్రామంలోని ఇద్దరు ఇటుక బట్టీల నిర్వాహకులు ఖాళీ చేశారని, మిగతా ముగ్గురిని సైతం ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బట్టీలు నడిపితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షుడు దీకొండ సంతోష్ కుమార్, టీఆర్ఎస్ గ్రామ ఉపాధ్యక్షుడు కొమ్ము ప్రవీణ్, కోశాధికారి కంచర్ల మధు, పల్లె ప్రవీణ్, వనపర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.