Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని లక్నవరంను సందర్శించే పర్యాటకులకు నూతన సంవత్సర కానుకగా కాకతీయ రిసార్ట్స్ కనువిందు చేయనుంది. ఇప్పటికే లక్నవరం పర్యాటక కేంద్రంలో పర్యాటకులకు కనువిందు చేసేలా నిర్మాణాలు కొనసాగుతుండగా, బుస్సాపురం గ్రామ పొలిమేరల్లో సుమారు రూ.10 కోట్ల రూపాయల వ్యయంతో మరికొన్ని అద్భుత నిర్మాణాలను కాకతీయ రిసార్ట్స్ చేపట్టింది. ఏడాదిగా నిర్మాణ పనులు కొనసాగుతుండగా మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. వీలైతే 2022 జనవరి 1న నూతన సంవత్సర కానుకగా పర్యాటకులకు అందుబాటులోకి తీసు కొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రిసార్ట్స్ యాజమాన్యం తెలిపింది. నభూతో నభవిష్యతి అన్న చందంగా నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. స్విమ్మింగ్ పూల్, మరో పూల్‌లో సముద్రపు అలలను తలపించే నిర్మాణాలు చేపట్టారు. చాలా ఎత్తు నుంచి నీరు జాలువారుతుండగా ఆ నీటి ద్వారా చాలా దూరం జారి వచ్చేలా నిర్మాణాలు చేపట్టారు. రానున్న రోజుల్లో పిల్లలకు, పెద్దలకు పూర్తి ఆహ్లాదాన్ని పంచేలా నిర్మాణాలు చేపడుతున్నట్లు రిసార్ట్స్ నిర్వాహకులు తెలిపారు. పర్యాటకు లకు అన్ని రకాల వసతి, సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గదులు, భోజన సదుపాయంతోపాటు అద్భుతమైన విహార అవకాశం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులతో అద్భుతమైన ఇంజనీరింగ్ సామర్థ్యంతో నిర్మాణాలు చేపడుతున్నారు. హైదరాబాద్, తదితర మహానగరాలకు దీటుగా అత్యాధునికంగా నిర్మాణాలు చేపట్టారు. రిసార్ట్స్ పూర్తయితే లక్నవరం పర్యాటక కేంద్రాన్ని సందర్శించే పర్యాటకులు ముందుగా కాకతీయ రిసార్ట్స్‌ను సందర్శిస్తా రని తెలుస్తోంది. ఎందుకంటే ఇది అద్భుతమైన పలు అంశాల్లో ప్రమాణాలతో నిర్మితమవుతోంది. కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తుండగా యాజమాన్యం అత్యంత ప్రతిష్టాతమ్కంగా నిర్మాణ పనులు చేపడుతోంది. రిసార్ట్స్ ద్వారా స్థానికులకు ఉపాధి కూడా లభిస్తుందని బుస్సాపురం గ్రామస్తులు ఆశిస్తున్నారు.