Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ప్రజాఉద్యమాలు నిర్మించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. మండలం చిన్నబోయినపల్లిలో వసంత నాగయ్య అధ్యక్షతన పార్టీ 5వ మండల మహాసభ మంగళవారం నిర్వహించగా ముఖ్యఅతిథిగా వెంకట్రెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని విమర్శించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడాన్ని విస్మరించిందని మండిపడ్డారు. జిల్లాలో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత విధానాలు అవలంభిస్తున్నాయని ద్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని తెలిపారు. బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మభ్యపెట్టి అప్పుల పాల్జేసిందని చెప్పారు. పాలకులు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతం చేసి సమరశీల పోరాటాలు నిర్మించాలని కోరారు. తద్వారా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి మహ్మద్ దావుద్, కన్నాయిగూడెం మండల కన్వీనర్ కావిరి సుధాకర్, మండల నాయకులు మహ్మద్ యాకూబ్, తోలెం కష్ణయ్య, బండారు నర్సింహులు, మహ్మద్ అంకుషావలీ, రెడ్డి వెంకట్రెడ్డి, ఈసీపీఎం మంగపేట మండల కన్వీనర్ నర్ర శివ ప్రసాద్, జాగటి చిన్న, తదితరులు పాల్గొన్నారు.