Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-నల్లబెల్లి
కిసాన్ క్రెడిట్ కార్డులను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లోని పాడి రైతులకు, మత్స్యకారులకు, గొర్రెల, మేకల పెంపకందారుల సంఘాల సభ్యులకు కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేసి మాట్లాడారు. భూమి లేని పాడి మత్స్య, గొర్రెల కాపర్లకు ఆర్థికసాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ కార్డులు ద్వారా 25 వేల నుంచి లక్షా 60 వేల వరకు రుణం పొందవచ్చని పేర్కొన్నారు. కేవలం ఏడు శాతం వడ్డీతో బ్యాంకు రుణం పొందవచ్చాన్నారు. ఈ వడ్డీలో సగం నాలుగు శాతం వడ్డీని ప్రభుత్వమే బ్యాంకర్లకు చెల్లిస్తుందన్నారు. కేవలం 3 శాతం వడ్డీ మాత్రమే రుణ గ్రహీతలు చెల్లిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం వ్యవసాయం చేసుకునే రైతుల కోసం ఏ విధంగా రుణమాఫీ ఇచ్చిందో, అదేవిధంగా ఈ పథకానికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం రైతులు దరఖాస్తు పెట్టిన 15-30 రోజులలో వారికి బ్యాంకులు కచ్చితంగా కార్డులు ఇవ్వాల్సిందేనని తెలిపారు. అర్హత లేని దరఖాస్తులు తిరస్కరిస్తే అందులో గల కారణాన్ని వారి మొబైల్ నెంబర్‌కి మెసేజ్ రూపంలో బ్యాంకు వారు పంపిస్తారన్నారు. నల్లబెల్లి, దుగ్గొండి మండలంలోని సొసైటీల్లో గుర్తించిన 4905 మంది మత్స్య, పాడి రైతులకు, గొర్రెల మేకల కాపరులకు సొసైటీల ద్వారా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. అర్హత ఉన్న ప్రతి రైతు కిసాన్ క్రెడిట్ కార్డు ని తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఎంపీడీవో విజరు కుమార్, ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్, పశుసంవర్ధక శాఖ ఏడీ, యూనియన్ బ్యాంక్ ఎల్డీఎం, జిల్లా మత్స్య శాఖ అధికారి, పీఏసీఎస్ చైర్మన్ మురళి, స్థానిక సర్పంచ్ రాజారాం, ఎంపీటీసీ జన్ను జయరాజు తదితరులు పాల్గొన్నారు.