Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేటు విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్ది గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు ఊదరగొడుతున్నా ఆచరణలోకి మాత్రం రావడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా గ్రాంట్ విడుదల కాకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలల్లో చాక్పీసులు, డస్టర్లు, పేపర్లు, తాగునీటి, విద్యుత్ బిల్లులు, తదితర నిర్వహణ ఖర్చులు ఎలా నడిపించాలని ప్రధానోపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పాఠశాలల గ్రాంటును కూడా పెంచాలని కోరుతున్నారు. 20 ఏండ్ల నాటికి లెక్కల ప్రకారం నిర్ణయించిన పాఠశాల గ్రాంటును నేటికీ కొనసాగిస్తుండడంపై ప్రధానోపాధ్యాయులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏటా పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా గ్రాంటు మంజూరు చేయడం పరిపాటి.
గ్రాంటు వినియోగం ఇలా..
ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో చాక్పీసులు, డస్టర్లు, పేపర్లు, పరీక్షల సామాగ్రి కొనుగోలు చేయడంపాటు జాతీయ పండుగలను నిర్వహించాలి. అలాగే హరితహారం, టాయిలెట్స్, ఆఫీస్ నిర్వహణ ఖర్చులు కూడా ప్రభుత్వ గ్రాంటు నుంచే చెల్లించాలాఇ. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు కొంత ఇబ్బంది లేకున్నా హైస్కూళ్లకు మాత్రం నిధులు సరిపోవడం లేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులను పెంచి సకాలంలో ఎప్పటికప్పుడు విడుదల చేయాలని హెచ్ఎంలు కోరుతున్నారు.