Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
స్థానికత, సీనియార్టీ ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆ సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన తొలి జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. నూతన జోనల్ విధానంపై ఉద్యోగులను, ఉపాధ్యాయులను నూతన జిల్లాలకు కేటాయించడం కొరకు ఇటీవల ప్రభుత్వం తీసుకొవచ్చిన జీఓ నెంబర్ 317లో కొన్ని సవరణలు చేయాల్సి ఉందన్నారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు కల్పించడానికి 2018లో ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు, జీఓ నెంబర్ 124కు అది విరుద్ధంగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో సీనియార్టీ మాత్రమే కాకుండా స్థానికత ఆధారంగా ఉపాధ్యాయులను నూతన జిల్లాలకు కేటాయించాల్సి ఉందన్నారు. లేనిపక్షంలో జూనియర్లకు నష్టం కలుగుతుందని చెప్పారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిన క్రమంలో అందుకు అనుగుణంగా వాలంటీర్లను ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులను మెరుగుపర్చాలని, స్కావెంజర్లను నియమించాలని, కేజీబీవీ ఉద్యోగుల పీఆర్సీ బకాయిలను ఒకే విడతలో చెల్లించి ఉద్యోగోన్నతులు, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం యూటీఎఫ్ ఏటూరునాగారం మండల ప్రధాన బాధ్యుడిగా సేవలు అందించిన పల్లె నాగరాజు ఎస్టీయూు సభ్యత్వం స్వీకరించారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోరిక రాజన్న, జిల్లా ఆర్ధిక కార్యదర్శి ఇనుగాల సూర్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి సోలం క్రిష్ణయ్య, జిల్లా మహిళ విభాగం అధ్యక్ష, కార్యదర్శులు లలిత, సుజాత, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు దాసరి రామ్మూర్తి, శ్యామ్సన్, శ్రీనివాస్‌నాయక్, వీరభద్రం, రమేష్ బాబు, సునీత తదితరులు పాల్గొన్నారు.