Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలతో రైతులను నట్టేట ముంచుతున్నాయని ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, రైతు నేత పోలాడి రామారావు తెలిపారు. హన్మకొండలోని ఓసీ సమాఖ్య కార్యాలయంలో ఆ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ధాన్యం సేకరణ, యాసంగి పంటల సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో అన్నదాతలకు క్రాఫ్ హాలిడే ప్రకటించడం మినహా మరో గత్యంతరం లేదన్నారు. జలాశయాలన్ని పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉండడంతో, వాటి కింద ఆయకట్టు ఆరుతడికి యోగ్యంగా లేకుండా పోయిందని పేర్కొన్నారు. ప్రస్తుత యాసంగి లో రైతు ఆరుతడి పంటల బాటపడితే, పెట్టిన పెట్టుబడులు కూడా రావన్నారు. విత్తనాల కొరత, మద్దతు ధర, మార్కెటింగ్ సౌకర్యం లాంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయన్నారు. ఆరుతడి పంటలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏది సూచించ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు విరుద్ధంగా యాసంగిలో రైతు వరి ధాన్యం వేస్తే మార్కెటింగ్ సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఎలాగూ వరి ధాన్యం కొనుగోలు చేయనని ప్రకటించిన దరిమిలా మిల్లర్లు తక్కువ ధరలకే కొంటామని మెలిక పెడితే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైతులు క్రాఫ్ హాలిడే పాటిస్తే బతుకుదెరువుకు ఎకరాకు 20 వేల చొప్పున ఖాతాలో ప్రభుత్వం ఆర్థికసాయాన్ని జమ చేయాలన్నారు. అదే విధంగా వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్న కూలీలకు క్రాఫ్ హాలిడే కాలానికి ఒక్కొక్కరికి 40వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ సమావేశంలో రైతు ప్రజా సంఘాల ప్రతినిధులు దుబ్బ శ్రీనివాస్, బోయినపల్లి పాపారావు, రావుల నర్సింహారెడ్డి, కేశవరెడ్డి సోమయ్య, రామకష్ణ, ప్రసాద్, సత్యమోహన శర్మ తదితరులు పాల్గొన్నారు.