Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
రైతులు పండించిన వరి ధాన్యాన్ని తేమ, తాలు పేరుతో రైస్ మిల్లర్లు భారీగా కోతలు విధిస్తూ రైతాంగాన్ని దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణరావు మండిపడ్డారు. మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించి స్థానిక రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైస్ మిల్లర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై వరి ధాన్యంలో భారీగా కోతలు విధిస్తూ రైతాంగాన్ని దోపిడికి గురి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. రైతాంగాన్ని దోపిడికి గురి చేస్తున్న రైస్ మిల్లర్ల పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి సింగారం గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద బస్తాకు 44 కిలోల తూకానికి రైతులు అంగీకరిస్తేనే నిర్వాహకులు కాంటా పెడుతుండడంతో ఆగ్రహించిన రైతులు కేంద్రంలోని వరి ధాన్యం తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. రైతు రుణమాఫీ ఆలస్యంగా విడుదల చేయడం వల్ల వడ్డీకే సరి పోతున్నాయని అన్నారు. యాసంగి లో వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర చెల్లించేలా ఆర్డినెన్స్ కోసం సీఎం కేసీఆర్ కొట్లాడలని అన్నారు. పార్లమెంటు సభ్యులు నిరసన తెలిపి రావడం కాదని, పంటకు మద్దతు ధర చట్టం తెచ్చే వరకు ఉద్యమించాలన్నారు. యాసంగి లో రైతులు ఇష్టమైన పంట వేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు మనోధైర్యం ఇవ్వాలని, రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని, పంటలకు గిట్టుబాటు ధర చెల్లిస్తూ, బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దూదిపాల బుచ్చిరెడ్డి, దుబాసి కష్ణమూర్తి, మారపెల్లి రవీందర్, చింతల భాస్కర్, చిందం రవి, నిమ్మల రమేష్, కుమారస్వామి, భిక్షపతి, మార్కండేయ, రఫీ, తదితరులు పాల్గొన్నారు.