Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ మహానగరం పరిధిలో మొట్టమొదటిసారిగా టీబీ రోగుల కోసంఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు 'టీబీ హెల్త్ ఆటో' వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీబీ హెల్త్ ఆటోలను జిల్లా క్షయ నియంత్రణ కేంద్రం డాక్టర్ పుట్టల సత్యసోమ మల్లికార్జున్ జెండా ఊపి ప్రారంభించారు. టీబీ వ్యాధికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పుట్టల సత్యసోమ మల్లికార్జున్ మాట్లా డారు. టీబీ అలర్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 'బ్రేకింగ్ ద బ్యారియర్' అనే ప్రాజెక్టు ద్వారా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. వరంగల్ మహా నగరంలో ప్రజలు టీబీ లక్షణాలతో బాధపడుతున్నట్లైతే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఎంజీఎం జంక్షన్‌లోని జిల్లా క్షయ నివారణ కేంద్రానికి వచ్చి ఉచిత తెమడ పరీక్ష, ఎక్స్‌రే పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణయితే ఆ వ్యక్తులు తమ వివరాలను 'నిక్షరు పోర్టల్'లో నమోదు చేసుకొని సంబంధిత వైద్యాధికారికి గాని, జిల్లా క్షయ నియంత్రణ విభాగంలో పనిచేసే సిబ్బందికి గాని తమ బ్యాంకు ఖాతా వివరాలు తెలియచేయాలన్నారు. అట్టి రోగులకు 'నిక్షరు పోషన్ యోజన పథకం' కింద నెలకు రూ.500 చొప్పున చికిత్స పూర్తయ్యే కాలం వరకు నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుందన్నారు. వైద్యుల సలహాలు, సూచనలు ప్రకారము సరైన మందులు, సరైన కాలం వరకు వాడితే వ్యాధి పూర్తిగా నయమవుతుందన్నారు. దేశాయిపేట, కాశిబుగ్గ ప్రాంతంలో బషీర్ 8978549720, చింతల్, ఎంజిఎం ప్రాంతంలో హరీష్‌శంకర్ 9908384846, కీర్తినగర్, ఎనుమాముల మార్కెట్ ప్రాంతంలో రవీందర్ 9392100399, రంగశాయిపేట, కరీమాబాద్ ప్రాంతంలో సహదేవరావు 9866175263 టిబి హెల్త్ ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారన్నారు. టిబి సంబంధిత వ్యాధులతో బాధపడే వారెవరైనా ఈ టీబీ హెల్త్ ఆటో డ్రైవర్లను సంప్రదించిన సేవలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్, సూపర్వైజర్ బాలు, ప్రాజెక్టు లీడ్ విశాల్ అభిషేక్, కమ్యూనిటీ కోఆర్డినేటర్ ప్రభాకర్, ప్రశాంత్, జిల్లా క్షయ నియంత్రణ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.