Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
జిల్లాలోని మంగపేట మండలంలోని కత్తిగూడెం రెవెన్యూ శివారులోని సర్వే నెంబర్ 123 నుంచి 128 వరకున్న సుమారు వంద ఎకరాల్లో దాదాపు 450 ఏండ్లుగా సాగు చేసుకుంటూ కాస్తు, కబ్జాలో ఉన్న పేదలకు పట్టాలివ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలోని బృందం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యను మంగళవారం కలిసి వినతిపత్రం అందించింది. అనంతరం వెంకట్రెడ్డి మాట్లాడారు. 2017లో కోయ సుభాష్ చంద్రబోస్ అనే భూస్వామి కబ్జాలో ఉండి పేదలను బెదిరిస్తూ నానా ఇబ్బందులు పెడుతుండగా నాటి సబ్ కలెక్టర్ గౌతమ్ సదరు భూమిని సర్వే చేయించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించారని చెప్పారు. సర్వే చేసి అర్హులకు పట్టాలివ్వాలని మంగపేట రెవెన్యూ అధికారులు కోరగా ఇప్పటివరకు పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే సర్వే చేయించి అర్హులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు అమ్జద్ పాషా, వాసం ఎర్రయ్య, అయ్యప్ప రాజు, రాంబాబు, గూడెపు పద్మ, మద్దిపోయిన కొండయ్య, పెదప్రోలు వెంకటాద్రి, దుబ్బ కష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
నవతెలంగాణ-గార్ల
కుటుంబ కలహాలతో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ ఇంద్రసేనరెడ్డి ఆదేశాల మేరకు డోర్నకల్ జీఆర్పీ కానిస్టేబుల్ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందు పట్టణానికి చెందిన వెంకటేష్ (22)కు నెల రోజుల క్రితమే వివాహం కాగా కుటుంబ కలహాలతో విరక్తి చెంది డోర్నకల్, గుండ్రాతి మడుగు రైల్వే స్టేషన్ల నడుమ ఎగువ లైన్ లో వస్తున్న కోబ్రా ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం మానుకోట జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్ట్మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.