Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య విమర్శించారు. ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో మంగళవారం రైతు భరోసా బైక్ యాత్ర నిర్వహించారు. తొలుత హనుమకొండలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి యాత్ర ప్రారంభించారు. ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లోని ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను, రైతు కల్లాలను సందర్శించి రైతుల బాధలను, పంట అమ్ముడుపోని, ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చుక్కయ్య మాట్లాడారు. ధర్మసాగర్ మండలంలో రైతులు పండించిన పంటను ఐకేపీ కేంద్రాల్లో బస్తాకు రెండు కేజీల చొప్పున, మిల్లుల్లో 5 నుంచి 7 కేజీల చొప్పున క్వింటాకు మొత్తంగా 13 కేజీలు రైతులు నష్టపోతున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల్లో జరుగుతున్న దోపిడీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో రైతు కనీసం నెల 10 రోజులు పంట అమ్ముడు పోయే వరకు ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వెలిబుచ్చారు. డబ్బులు కూడా కాంటా అయిన తర్వాత 15 రోజులకు మాత్రమే అందుతున్నాయని చెప్పారు. ఈలోపు రైతులను అప్పుల వాళ్లువేధిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతును దోపిడీ నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఉప్పలయ్య, గొడుగు వెంకట్, జిల్లా కమిటీ సభ్యులు వీరన్న, తిరుపతి, బండి పర్వతాలు, చక్రపాణి, సంపత్, రాఘవులు, భాగ్య, గాదె రమేష్, తదితరులు పాల్గొన్నారు.