Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసీ సంఘాలతో సమన్వయ సమావేశం
- యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ
నవతెలంగాణ-తాడ్వాయి
2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్న మేడారం మహాజాతర విజయవంతానికి పోలీసులు, పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులు పాటు పడాలని ములుగు ఏఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కోరారు. మేడారంలో పూజా రులు, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు, గ్రామ యూత్ నాయకులతో పీసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఏఎస్పీ మాట్లాడారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం జాతరకు కోటి పైచిలుకు జనం వస్తారని తెలిపారు. వారికి ఇబ్బందులు కలుగకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పోలీసులు, పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, గ్రామ యూత్ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అనంతరం జాతరలో ఎదురయ్యే సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. చెక్‌పోస్టుల వద్ద పూజారులకు, యూత్ సభ్యులకు ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఆదివాసీ సంఘాల, స్థానిక యూత్ ప్రతినిధులకు, పూజారులకు ప్రత్యేక గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివాసీ సంస్కతి, సాంప్రదాయాలకు అనుగుణంగా జాతర విజయవంతానికి కషి చేయాలని కోరారు.
యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ
పసరా సీఐ శంకర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ గద్ద రవీందర్, స్థానిక ఎస్సై వెంకటేశ్వర్రావులతో కలిసి ఏఎస్పీ సుధీర్ రామ్‌నాధ్ కేకన్ స్థానిక యువతకు వాలీబాల్ కిట్లు అందించి మాట్లాడారు. యువత క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడలతో ఆరోగ్యం మెరుగౌతుందని, క్రమశిక్షణ అలవడుతుందని, జాతీయ భావం పెంపొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల ప్రతినిధులు కాక నర్సింగరావు, కబ్బాక శ్రావణ్‌కుమార్, ముద్దబోయిన రవి, చింత కృష్ణ, ఇర్ప విజయ, సరోజన భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.