Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
తేమ, నూక శాతం పేరుతో ధాన్యంలో, మద్దతు ధరలో కోత పెట్టొద్దని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడు శోభన్, జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ను గురువారం నాయకులు పర్యటించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నినాదాలు చేస్తూ చినిగిన గోనె సంచులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అనంతరం శోభన్, వెంకన్న మాట్లాడారు. అకాల వర్షాల వల్ల వరి పంట దెబ్బతిని దిగుబడులు బాగా తగ్గిపోయాయని తెలిపారు. ఎకరాకు 20 నుంచి 25 బస్తాల దిగుబడి రావడంతో పెట్టుబడులు, ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. పంట నష్టంతో కౌలు ఎలా చెల్లించాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో రైతులు అల్లాడుతున్నారని చెప్పారు. ధాన్యం పట్టుబడికి గోనె సంచులు కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. 17 తేమ వచ్చినా నూక శాతం పేరుతో ధర తగ్గిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గునిగంటి రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు నల్లపు సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఐనవోలు : మండలంలోని కొండపర్తి, వెంకటాపురం, రాంనగర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ముమ్మడి శ్రీకాంత్, జిల్లా నాయకుడు బండి పర్వతాలు మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య, రైతు సంఘం మండల అధ్యక్షుడు గుండెకారి మహేందర్, నాయకులు నారాయణరెడ్డి, బాబురావు, యాకయ్య, గోపాల్, కొమురయ్య, నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.