Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
జిల్లాలో చేపట్టిన రోడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా అటవీ శాఖ అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. జిల్లాలో రోడ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అడ్డంకులు తలెత్తకుండా చూడాలని ఆయన చెప్పారు. జిల్లాలో ఫారెస్ట్, రెవెన్యూ సమస్యలు, ఎకో సెన్సిటివ్ జోన్‌పై జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రదీప్‌కుమార్‌శెట్టి, అదనపు కలెక్టర్ ఇలా త్రిపారి, డీఆర్వో రమాదేవి, సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో కలెక్టర్ గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కష్ణ ఆదిత్య మాట్లాడారు. జిల్లాలో 10 రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్టు తెలిపారు. వాటికి శాఖాపరమైన అనుమతులు మంజూరై పనులు పురోగాతిలో ఉన్నాయని చెప్పారు. ఆర్ అండ్ బీ, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయతీ రాజ్ శాఖల ఆధ్వర్యంలో రామప్ప, లక్నవరం, తదితర ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రామప్ప ఆలయానికి యూనెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా, పర్యాటకులకు ఇబ్బంది కాకుండా రోడ్లను త్వరగా నిర్మించాలని సూచించారు. మేడారం జాతర సందర్భంగా వచ్చే జనం రామప్ప, లక్నవరం, తదితర పర్యాటక కేంద్రాలను సందర్శిస్తున్నారని తెలిపారు. సందర్శకుల సౌకర్యార్థం రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు అక్కడక్కడా ఆటంకం కల్పిస్తున్న క్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రదీప్కుమార్శెట్టికి పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఫారెస్ట్ అధికారి ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.
18 సీజేఐ రామప్ప పర్యటన
ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
ఈనెల 18న సీజేఐ ఎన్వీ రమణ జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నట్టు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ క్రమంలో ఏర్పాట్లను వరంగల్ 9వ అదనపు జిల్లా జడ్జి అనిల్‌కుమార్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మెన్ మహేష్‌నాథ్, హైకోర్టు ప్రాజెక్ట్ మేనేజర్ విశాల, ములుగు జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రరావుతో సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ, ఆర్డీఓ రమాదేవి, జిల్లా వైద్య అధికారి అప్పయ్య, ములుగు, వెంకటాపూర్ మండలాల తహసీల్దార్లు సత్యనారాయణ స్వామి, మంజుల, డీఎల్పీఓ దేవరాజ్ పాల్గొన్నారు.