Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా యువత భాగస్వామ్యం కావాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్‌లో రోడ్డు భద్రతా నియమాలు, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనల పట్ల శుక్రవారం నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రమాదాల నివారణలో ఫలితాలు సాధించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలకు గురి కాకుండా పాటించాల్సిన నియమాల పట్ల అవగాహన కల్పించారు. టూ వీలర్స్ నడిపే వ్యక్తులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, కారులో ప్రయాణం చేసే సమయంలో విధిగా సీటుబెల్టు ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కావద్దని సూచించారు. జాతీయ, రాష్ట్ర రహదారులలో ప్రయాణం చేసే సమయంలో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపవద్దని చెప్పారు. వాహనాల డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని, ఆటోల్లో వాహన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, ప్రతి వాహనదారుడు విధిగా వేగ పరిమితి పాటించాలని, తదితర సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ సదయ్య, డీటీఓ వేణు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి, డిపో మేనేజర్ విజయలక్ష్మి, టౌన్ సీఐ వెంకటరత్నం, రూరల్ సీఐ రవికుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సురేందర్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ యాసీన్, తదితరులు పాల్గొన్నారు.