Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మున్సిపల్ కార్మికులకు పెంచిన పీఆర్సీ అమలు చేస్తూ కనీస వేతనం రూ.24 వేలు చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, టీఎమ్మార్పీఎస్, ఇతర సంఘాల ఆద్వర్యంలో హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని కలెక్టరేట్ల, మున్సిపల్ కార్యాలయాల ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
సుబేదారి/హనుమకొండ చౌరస్తా : హనుమకొండలోని కలెక్టరేట్, హనుమకొండలోని అశోకా జంక్షన్‌లోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ, టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి ఉప్పలయ్య, టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల భిక్షపతి మాట్లాడగా అశోకా జంక్షన్‌లోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉప్పలయ్య, భిక్షపతితోపాటు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి వేల్పుల సారంగపాణి మాట్లాడారు. మున్సిపల్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాలను ఎండగట్టారు. మున్సిపల్ కార్మికులకు జీఓ నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం రూ.19 వేలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాజీపేట : కాజీపేట మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా జిల్లా సహాయ కార్యదర్శి బొట్ల చక్రపాణి మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఐక్యపోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమౌతాయని ఆయన చెప్పారు.
మహబూబాబాద్ : కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి మాట్లాడారు. రాష్ట్రంలో వేతన ఒప్పందం ప్రకారం పీఆర్సీ 30 శాతం పెంచి జూన్ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి ఆర్నెళ్లు గడచినా అమలు చేయకపోవడం దారుణమన్నారు. కనీస వేతనం రూ.24 వేలు అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కేంరద, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కొమురయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కుమ్మరికుంట నాగన్న, ఐఎఫ్టీయూ నాయకులు భాస్కర్‌రెడ్డి, పైండ్ల యాకయ్య, మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు కాంపెళ్లి శ్రీనివాస్, కొమ్ము దేవేందర్, కాగితం శ్రీనివాస్, వెంకటనర్సయ్య, శంకర్, లచ్చిరామ్, ప్రసాద్, యాకయ్య, రాజశేఖర్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.