Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-తొర్రూరు
ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి నష్టపోయిన మొదటి సంవత్సర విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మాలోతు సురేష్ బాబు, లవిశెట్టి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థులతో కలిసి స్థానిక అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం నిరసన కార్య క్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సురేష్, ప్రసాద్ మాట్లాడారు. కరోనా కష్టకాలంలో విద్యార్థుల చదువులతో చెలగాటం ఆడటమే కాకుండా డిజిటల్ తరగతుల పేరుతో విద్యార్థులను మభ్యపెట్టారని చెప్పారు. దాదాపు 70 శాతానికిపైగా విద్యార్థులు డిజిటల్ క్లాసులకు హాజరు కాలేదని ప్రభుత్వానికి తెలిసినా పరీక్షలు నిర్వహించడం వల్లే 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణ కాలంలో విద్యార్థులకు ఉచితంగా ఫోన్లు, ట్యాబ్లు అందివ్వాలని ఎస్ఎఫ్ఐ కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. గతంలోనూ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్ల 21 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. తరగతులు నిర్వహించకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు కనీసం పాస్ మార్కులు వేసి పాస్ చేయాలని, విద్యార్థులకు విద్యాసంవత్సరం నష్టం కాకుండా చూడాలని, పాస్ అయిన వారికి ఉచితంగా రీవాల్యుయేషన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల కార్యదర్శి అమీర్, డివిజన్ నాయకులు వెంకటేష్, శ్రీను, నవీన్, తదితరులు పాల్గొన్నారు.