Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూకే నుంచి వచ్చిన మహిళకు..
- లక్షణాలు లేవు : డీఎంహెచ్ఓ
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హనుమకొండ జిల్లా కేంద్రంలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన మహిళ (29)కు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో శుక్రవారంనాడు ఆమెను 108లో హుటాహుటిన హైద్రాబాద్‌లోని టిమ్స్‌కు తరలించారు. డిసెంబర్ 1న ఆమె భర్త, కూతురుతో కలిసి వరంగల్‌కు చేరుకున్నారు. హైద్రాబాద్ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా కోవిడ్ నెగెటివ్ వచ్చింది. 8 రోజుల అనంతరం మళ్లీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది మళ్లీ ఆ కుటుంబానికి తొలుత రాపిడ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. అనంతరం ఆర్టీపీసీఆర్ పరీక్షకు శ్యాంపిల్స్ సేకరించి పంపించారు. డిసెంబర్ 13న కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 14న జీనోమ్ సీక్వెన్స్‌కు హైద్రాబాద్ ల్యాబ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా గుర్తించారు. దీంతో శుక్రవారం ఆ మహిళను హైద్రాబాద్ టిమ్స్‌కు తరలించారు.
ఉమ్మడి వరంగల్‌లో కలకలం..
హన్మకొండలో మహిళకు ఒమిక్రాన్ రావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేగుతోంది. ఒమిక్రాన్ డెల్టా వైరస్ కంటే వేగంగా విస్తరిస్తుందని చెబుతుండడంతో నగరవాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. థర్డ్ వేవ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తరించే అవకాశాలుండడంతో ఈ కేసు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఒమిక్రాన్ సోకినా లక్షణాలు లేవు : డీఎంహెచ్ఓ
ఒమైక్రాన్ వైరస్ సోకిన హన్మకొండ మహిళకు కోవిడ్ లక్షణాలు లేవని హనుమకొండ డీఎంహెచ్ఓ లలితాదేవి 'నవతెలంగాణ'కు తెలిపారు. హన్మకొండలో ఒమిక్రాన్ వైరస్‌ను మహిళలో గుర్తించిన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందకుండా భౌతిక దూరం విధిగా పాటిస్తూ, మాస్క్‌లను ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. డిసెంబర్ 1 నుంచి విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారి జాబితా మెయిల్ ద్వారా పంపుతున్నారని, ఈ మేరకు ఇప్పటి వరకు 55 మంది విదేశాల నుండి వచ్చారని తెలిపారు. వీరందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా, తాజాగా ఈ మహిళకు మాత్రమే 'ఒమిక్రాన్' వైరస్ సోకిందని గుర్తించడం జరిగిందన్నారు. ఆమెతో ప్రాథమిక కాంటాక్ట్‌లో ఉన్న 26 మందిని హోమ్ ఐసోలేషన్‌లో వారికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామని, నివేదికలు రావాల్సి ఉందని చెప్పారు. వారి నివాస పరిసరాల్లో స్ప్రే చేయించామన్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందరినీ పరీక్షిస్తున్నారని తెలిపారు. ఒమిక్రాన్ వైరస్ సోకిన మహిళ కుటుంబ సభ్యులను పరీక్షిస్తున్నామని వివరించారు.