Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుప్రీంకోర్టు ప్రధాన
న్యాయమూర్తి ఎన్వీ రమణ
నవతెలంగాణ-ములుగు
రామప్ప ఆలయంలోని శిల్ప సంపద అద్భుతమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ అన్నారు. జిల్లాలోని రామప్ప ఆలయాన్ని కుటుంబసమేతంగా ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడారు. 800 ఏండ్ల క్రితం నిర్మితమైన రామప్పకు యునెస్కో ప్రపంచ స్థాయి గుర్తింపు లభించడం గర్వకారణమన్నారు. ఇసుక పునాదులపై ఆలయాన్ని నిర్మించడం, నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని తీర్చిదిద్దడం, శతాబ్దాలు గడిచిపోతున్నా ఆలయ నిర్మాణంలో వినియో గించిన రాయి రంగు చెక్కు చెదరకుండా కాంతులీనడం రామప్ప విశిష్టత విశ్వవ్యాప్తం కావడానికి ప్రధాన పాత్ర వహించాయని తెలిపారు. ఆలయంలోని శిల్ప కళాకతుల్లో 'నాగిని', నవరస సమ్మేళనంగా వీక్షకులపై చెరగని ముద్ర వేస్తున్నాయని చెప్పారు. పేరిణి శివతాండవంగా పేరొందిన వీరనాట్యం ఈ ఆలయ శిల్పాల్లో దాగి ఉండడం మరో విశేషమని కొనియాడారు. తొలుత రామప్ప సందర్శనకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ దంపతులకు హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, హైకోర్ట్ న్యాయవాదులు ఉజ్జల్ భూయన్, రాజశేఖర్‌రెడ్డి, వరంగల్ నవీన్‌రావు, జిల్లా 9వ అదనపు జిల్లా జడ్జి అనిల్‌కుమార్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ మహేష్‌నాథ్, ములుగు జూనియర్ సివిల్ జడ్జి రాంచందర్‌రావు, జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య, మహబాబాబాద్ ఎంపీ కవిత, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్వో రమాదేవి, వెంకటాపూర్ తహసీల్దార్ మంజుల పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. రమణ దంపతులతో ఆలయంలో పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో డీపీఓ వెంకయ్య, ములుగు, తాడ్వాయి మండలాల తహసీల్దార్లు సత్యనారాయణ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.