Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలసత్వం దిశగా కాంట్రాక్టర్
నిధులు ఉన్న నిలిచిన రోడ్డు నిర్మాణం
తిర్మలాయపల్లి ప్రజల కల నెరవేరేదేప్పుడూ.. ?
నవతెలంగాణ-రాయపర్తి
దైవం దారి చూపిన.. దరిద్రం దరి చేరనివ్వడం లేదన్నట్టుగా ఉంది మండలంలోని తిర్మలాయపల్లి - రాయపర్తి బీటీ రోడ్డు నిర్మాణ పనుల తీరు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండలంలోని రోడ్ల నిర్మాణా నికి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తుంటే వైట్కాలర్ లీడర్లు, కాంట్రాక్టులు చేజిక్కించుకొని ఏండ్ల తరబడి అలసత్వం వహించడంతో మంత్రి, ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు.
నిధులు పుష్కలం.. నిర్మాణం శూన్యం...
మంత్రి దయాకర్రావు రూ.లు 2కోట్ల 40లక్షల ఎస్డీఎఫ్ నిధులతో మే 18, 2018న తిర్మలాయపల్లి నుంచి రాయపర్తి మండలకేంద్రానికి బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు. అయితే కాంట్రాక్టర్ హంగు ఆర్భాటాలతో మట్టి పోసి మమ అనిపించడంతో వ్యవసాయ పనుల నిమిత్తం ఆ రోడ్డును ఉపయోగించుకునే రైతుల కళ్ళల్లో మట్టి కొట్టి నట్లయింది.
అప్పటి వరకు ఒక మోస్తరుగా ఉన్న రోడ్డు మట్టి పోయడంతో బురదమయమైపోయి గుంతలుగా ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. రోడ్డు నిర్మాణానికి చేపట్టిన మట్టిని వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి స్థానిక చెరువులో నుండి అక్రమంగా తీయడంతో చెరువులు సైతం దోపిడీకి గురయ్యాయి. ''వెనుక దగా, ముందు దగా, కుడి ఎడమలు దగా దగా'' అని శ్రీశ్రీ కవిత్వాలు చెప్పే కాంట్రాక్టర్ అలియాస్ ప్రజా పాలకుడు తాను నీతులు చెప్పడం కాదు పాటిస్తే బాగుండేదని ప్రజలు అంటున్నారు.
చుట్టూ తిరిగే ప్రయాణంతో ప్రజల ఇక్కట్లు..
మండల కేంద్రానికి రావడానికి తిర్మలాయపల్లి ప్రజలు వర్ధన్నపేట నుంచి, లేదా కొండూరు నుంచి రావాల్సి వస్తుంది. వర్ధన్నపేట మీదుగా రావాలంటే 16కి.మీ, కొండూరు మీదుగా రావాలంటే 10కి.మీ వెళ్లాల్సి వస్తుంది. మంత్రి చేపట్టిన రోడ్డు నిర్మాణంతో కేవలం 3-4 కిలోమీటర్ల దూరంతో మండల కేంద్రానికి చేరవచ్చని తిర్మలాయపల్లి ప్రజలు అంటున్నారు. నాయకత్వం స్వార్థ ప్రయోజనాలకే తప్ప నిస్వార్ధ పాలన కోసం కాదు అన్నట్లుగా స్థానిక పాలకులు వ్యవహరించడంతో మండలాన్ని సస్యశ్యామలం చేయాలన్న మంత్రి ఎర్రబెల్లి లక్ష్యం మసకబారుతోంది. ఇప్పటికైనా ఖద్దరు చొక్కా కాంట్రాక్టర్ నిద్రావస్థను వీడి సకాలంలో రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులు చొరవ చూపాలని మండల ప్రజలు అంటున్నారు.