Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిత్యావసరాల ధరలు తగ్గించాలి : కాంగ్రెస్
నవతెలంగాణ-ఏటూరునాగారం
నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో పాలకులు విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆర్ఐకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలను గాలికొదిలేశాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచి పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయని చెప్పారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్శవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అయూబ్ ఖాన్, జిల్లా నాయకుడు ఖలీల్ ఖాన్, మాజీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ వావిలాల నర్సింహారావు, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ గౌస్, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, మండల ఉపాధ్యక్షుడు రియాజ్ జియా, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు ముక్కెర లాలయ్య, నాయకులు పడిదల హన్మంతు, సంపత్, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.