Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
పాలక పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దోపిడీ రహిత సమాజం కోసం ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్ పిలుపునిచ్చారు. శనివారం హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా క్యాడర్ శిక్షణా తరగతులు ప్రారంభమవగా, శిక్షణ తరగతులకు ప్రిన్సిపాల్‌గా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టీ ఉప్పలయ్య వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ దేశ సంపదను కార్పొరేటు శక్తులకు దోచి పెడుతోందని విమర్శించారు. కార్మికులను, కష్టజీవులను నిరుపేదలుగా మార్చి తన శ్రమ ఆమ్ముకుంటే తప్ప కుటుంబం గడిచే పరిస్థితి లేకుండా చేశారని వాపోయారు. పెట్టుబడిదారి వ్యవస్థలో నిరుద్యోగం నీడలాగా ఉంటుందని మార్క్స్ ఏనాడో చెప్పాడని, అది ప్రస్తుత పరిస్థితుల్లో రుజువు అవుతోందన్నారు. సమాజంలో కార్మికులను, కష్టజీవులను మరింత పేదలుగా మార్చి పెట్టుబడిదారుల సంపద పోగు పడడం కోసమే పాలకులు పని చేస్తున్నారని, అందుకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడుతుంటే ప్రజలను చీల్చడం కోసం, మతం, కులం, ప్రాంతం, లింగం, బాష పేరుతొ విడగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. వర్గ సమాజం పోవాలంటే వర్గ రహిత సమాజం కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) హన్మకొండ జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సారంపల్లి వాసుదేవ రెడ్డి, జీ ప్రభాకర్ రెడ్డి, గొడుగు వెంకట్, జిల్లా కమిటీ సభ్యులు వాంకుడోత్ వీరన్న, గుమ్మడిరాజుల రాములు, మంద సంపత్, బొట్ల చక్రపాణి, ధరావత్ భాను నాయక్, కాడ బోయిన లింగయ్య, భాష బోయిన సంతోష్ పాల్గొన్నారు