Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ రైతు వ్యతిరేక విదానాలను వివరించాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయప్రతినిధి
ధాన్యం సేకరణలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ సోమవారం నిర్వహించే నిరసన కార్యక్రమాలు, చావు డప్పులు ర్యాలీలు, ఊరేగింపు కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం నిరసన కార్యక్రమంపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమం జరిగే విధంగా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని దయాకర్రావు సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగానికి చేయూతనిస్తూ వ్యవసాయాన్ని పండుగగా మారే విధంగా చేశారన్నారు. ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పుష్కలంగా సాగునీరు, రైతు బంధు, సకాలంలో ఎరువులు, విత్తనాలు దొరికే విధంగా చేశారన్నారు. లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయని, రాష్ట్రంలో పంట దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు. వానాకాలం వడ్ల కొనుగోలు విషయంలో అస్పష్టమైన, గందరగోళం చేస్తూ, అయోమయపరుస్తుందని మంత్రి ఆరోపించారు. తాను ఇతర మంత్రుల బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రులను నిలదిస్తామని తెలిపారు. తాను ఢిల్లీలో ఉన్నందున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనలేక పోతున్నానని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర రైతాంగాన్ని అయోమయానికి, ఆందోళనకు గురిచేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరువాడలో చావు డప్పు కార్యక్రమంలో పాల్గొనడానికి రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, టి.రాజయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్, ఆరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.