Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శానిటరీ ఇన్స్పెక్టర్లపై అవినీతి ఆరోపణలు
ఆందోళనలో వ్యాపారస్తులు
చోద్యం చూస్తున్న పై అధికారులు
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
నగరంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికీ ట్రేడ్ లైసెన్సులు ఇవ్వాల్సిన శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆ లైసెన్సుల జారీలో గోల్మాల్ చేస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. గ్రేటర్‌లోని కొంతమంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఒక్కొక్క వ్యాపారానికి ఒక్కొక్క రేటు చెప్పి ట్రేడ్ లైసెన్సు ఇచ్చేటప్పుడు అదనంగా వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియా పరిధిలో సుమారు 23 వేల8వందల మంది వ్యాపారులున్నారు. అందులో
19వేల 2వందల మంది వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్సులను రెన్యూవల్ చేసుకున్నారు. ఇప్పటికే 78 శాతం ట్రేడ్ లైసెన్స్‌పై పన్నులు వసూలు చేశారు. ఇదిలా వుంటే నూతనంగా ట్రేడ్ లైసెన్సులు తీసుకునే వారి నుంచి రూ.లు రెండు నుంచి ఐదు వేల వరకూ వసూలు చేస్తున్నారని, అంతేకాకుండా వారి నుంచి అది, ఇది అని చెప్పి అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చికెన్ సెంటర్లు, మాంసం దుకాణం, కిరాణ దుకాణం, అల్లం ఎల్లి గడ్డ హౌల్‌సేల్ దుకాణాలు,హౌటల్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఆసుపత్రులు, ఫంక్షన్ హాల్ నుంచి శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రతి నెలా జవాన్లను పంపించి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. ట్రేడ్ లైసెన్స్ లేని వారి నుంచి ప్రతి నెలా శానిటరీ ఇన్స్పెక్టర్లు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఇవ్వనట్లయితే అధికమైన పెనాల్టీలు వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శానిటరీ ఇన్స్పెక్టర్లు అవినీతి ఆరోపణలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు చేపట్టుతారో లేదో వేచి చూడాల్సి ఉంది.