Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
రానున్న వేసవిలో ధాన్యం కొనుగోలు చేయకుంటే బీజేపీ నాయకులను గ్రామాల్లో అడుగుపెట్టనివ్వమని గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రం మెడలు వంచి ధాన్యం మొత్తం కొనుగోలు చేయించాలన్నారు. రాష్ట్ర రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ అనుచిత వైఖరిని వ్యతిరేకిస్తూ, ఇక్కడ పండించే ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాక ముందు సామాన్య రైతులు అనేక కష్టాలు పడ్డారని చెప్పారు. సాగు నీటి, ఇతర సదుపాయాల్లేక కూలీలుగా వెళ్లాల్సిన దుస్థితి ఉండేదని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రైతుల అభివృద్ధిని ఓర్వలేకే కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడాన్ని నిరాకరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలుగా నేటి నిరసనను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, కౌన్సిలర్లు మార్నేని వెంకన్న, మార్నేని రఘు, ఫరీద్, చిట్యాల జనార్ధన్, గోగుల రాజు, హరి, సలీమ్, నాయకుడు అజరు, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సీతారాములు మాట్లాడారు. ఈనెల 20న తలపెట్టిన రైతుధర్నాను విజయవంతం చేయాలని కోరారు.