Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
ఏజెన్సీ ప్రాంతంలో ఏ పని జరగాలన్నా పీసా సభల అనుమతి అవసరమన్నది రాజ్యాంగంలో పొందుపర్చిన విషయం. అది చట్టం. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ ఎవరు చెప్పినా పీసా సభ అనుమతి లేకుండా పనులు చేపడితే ఆపే అధికారం గిరిజనుల సొంతం. అది చట్టంలోని ప్రధానమైన అంశం, రాజ్యాంగం కల్పించిన హక్కు. కాగా మేడారంలో మాత్రం పీసా చట్టానికి పాతరేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రెండేండ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతరకు ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా సందర్శకులకు సరైన విధంగా సౌకర్యాలు కల్పించడంలో మాత్రం వైఫల్యం చెందుతున్న పరిస్థితి కనడపతుతోంది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో చేపట్టిన పనులు స్థానికులకు కూడా ఉపయోగపడడం లేదన్నది అక్షర సత్యం. మేడారం నిధులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కాంట్రాక్టర్లకు జేబులు నింపుకోవడానికేనా..? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మేడారంలో పీసా సభ అనుమతి లేకుండా చేపట్టిన అన్ని పనులూ చట్ట విరుద్ధమే. మేడారం, ఊరట్టం గ్రామపంచాయతీల్లో పీసా గ్రామ సభ పెడితే ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇతర సమస్యలు లేవనెత్తే అవకాశముండడంతోపాటు ఆ పనులు చేపడితే కమీషన్లు ఎక్కువగా దండుకోలేమన్న భావనతో పీసా సభలు నిర్వహించడం లేదని గిరిజనులు బహిరంగంగానే మండిపడుతున్నారు. గత జాతరకు ముందు రూ.14 కోట్ల వ్యయంతో జంపన్న వాగులో నిర్మించిన చెక్‌డ్యామ్‌లు కేవలం కమీషన్ కోసమే అన్న విమర్శల్లోని వాస్తవం కండ్లకు కనపడుతోంది.
శాశ్వత పనులతో ప్రయోజనం
ఏటా జాతరకు కేటాయించే నిధులతో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడితే జాతరకొచ్చే జనానికి, స్థానికులకు ప్రయోజనం ఉంటుంది. మేడారం చుట్టూ ఉన్న ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు గ్రామాల్లోని అన్ని సమస్యలూ పరిష్కారమై అవి ఆదర్శ గ్రామాలుగా నిలుస్తాయి. కానీ అధికారుల నిర్లక్యం, ప్రజాప్రతినిధుల దోపిడీ, పీసా కమిటీల అమాయకత్వంతో.. అధికారులు నిర్ణయం తీసుకున్న పనులు మాత్రమే చేపట్టడంతో స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు డమ్మీ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ స్థానిక ప్రజాప్రతినిధులు సైతం సరైన అవగాహన లేక నిధుల దుర్వినియోగానికి పరోక్షంగా కారకులౌతున్నారు.
జాతర పనులు మొదలైతే చాలు..
మహాజాతర పనులు మొదలైతే చాలు అవినీతి రాజ్యమేలుతోంది. మేడారం, ఊరట్టం గ్రామ పంచాయతీల్లోని పీసా కమిటీ సభ్యులు నిత్యం మద్యం మత్తులో జోగుతున్నారన్న వేదన ప్రజల్లో నెలకొంది. వీళ్ల అమాయకత్వమే నిధుల దోపిడీకి అవకాశం కల్పిస్తోందంటూ ఇక్కడి విద్యావంతులైన పలువురు వాపోతున్నారు. పీసా కమిటీ సభ్యులు అమాయకంగా కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్న దుస్థితి నెలకొంది. కేవలం మద్యానికే తప్ప సంపాదించుకున్నది సైతం పీసా కమిటీ సభ్యులకు ఏమీ ఉండదు. పీసా కమిటీ సభ్యులను మద్యం మత్తులో ముంచి మేడారాన్ని దోచుకుంటున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.
అడ్డగోలోనికి అధికారమిస్తే..
అడ్డగోలోనికి అధికారమిస్తే అంతా దోచి దోపిడీదారులకు అప్పగొంచినట్లే అన్న తాతల కాలం నాటి వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఐటీడీఏ ఉన్నా పీసా చట్టం గురించి అవగాహన కల్పించిన దాఖలాల్లేవు. గోదావరి ఇసుక కోసమే ఐటీడీఏ పని చేస్తోందన్న అపవాదు ఉంది.
గిరిజన సంఘాలు, మేథావులు చొరవ చూపాలి
మేడారం జాతర పరిసరాల్లోని అమాయకపు ప్రజాప్రతినిధులను, పీసా కమిటీ సభ్యులను మద్యం మత్తులో ముంచి పీసా సభ లేకుండానే పనులు చేపడుతున్న క్రమంలో ఆదివాసీ గిరిజన సంఘాలు, మేథావులు చొరవ చూపాలని మండల ప్రజలు ఆశిస్తున్నారు. పీసా గురించి అవగాహన కల్పించడంలో ఐటీడీఏ వైఫల్యాలను, ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రతిఘటించడంతోపాటు నిర్వీర్యమౌతున్న పీసా గురించి ఆదివాసీ గిరిజనానికి అవగాహన కల్పించి చైతన్యవంతం చేయడంలో మండలానికి చెందిన మేథావులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.