Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాంక్‌ల నుంచి రూ.1.60లక్షల రుణం..
స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ క్యాంప్‌ల్లో అవగాహన.. దరఖాస్తుల స్వీకరణ
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
వ్యవసాయ ఉత్పత్తి రంగంలో పాలుపంచుకొనే ప్రతి ఒక్కరికి బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేస్తాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం క్యాంప్ కార్యాలయంలోని సెమినార్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంటు భూమి లేకున్నా..జామీను లేకుండా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కిసాన్ కార్డులను అందజేసేందుకు ప్రత్యేక కార్యచరణ తీసుకొన్నామన్నారు. వరంగల్ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైందని ఈ మేరకు నియోజవర్గంలో కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
నియోజకవర్గంలో ఇప్పటి వరకు కనీసం బ్యాంక్‌ల ద్వారా రుణ సహాయం తీసుకోని వారు సుమారు 10వేల కుటుంబాలు ఉన్నట్లు సూచనప్రాయంగా వెల్లడైందన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఆయా బ్యాంక్‌లు తాము ధత్తత తీసుకున్న గ్రామాల పరిధిలోని అర్హులకు ధరఖాస్తు అందజేసిన 30 రోజుల్లో కిసాన్ కార్డు, తగిన రుణ సహాయాన్ని భేషరత్‌గా అందజేయాల్సి ఉందన్నారు. ముందుగా ఆర్గనైజేషన్ పరిధిలోని మత్స్య కారులకు, గొర్లకాపరులు, పాలఉత్పత్తిదారులకు కిసాన్ కార్డులను అందజేసేందుకు నియోజవర్గంలో స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ తీసుకొని క్యాంప్‌ల ద్వారా అవగాహన పెంపొందిస్తూ కార్డులకు ధరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో క్యాంప్‌లు నిర్వహించగా 1600ల మంది నుంచి ధరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 20న నెక్కొండలోని మార్కెట్ యార్డులో, చెన్నారావుపేటలో 22న పట్టణంలోని పాలకేంద్రం ఎదుట క్యాంప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డు హౌల్డర్లకు కేవలం 30 పైసల వడ్డీకి మాత్రమే రుణ సహాయాన్ని బ్యాంకుల అందిస్తాయన్నారు. 2లక్షల బీమా కూడా వర్తిస్తుందన్నారు.
త్వరలోనే మిగతా వ్యవసాయ ఉత్పత్తి రంగాలకు చెందిన వారికి కూడా కిసాన్ క్రెడిట్ కార్డులను అందించడానికి అధికారులు చర్యలు చేపట్టనున్నారని తెలిపారు. ఆయ రంగాలపై ఆధారపడిన రైతులకు కేసీసీ కార్డు ఒక వరం లాంటిదన్నారు. ఈ కార్డుల వల్ల బ్యాంక్ రుణాలు కల్పించబడి ఉత్పత్తి రంగాలపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాలు పెరిగి జీవన ప్రమాణాలు మెరుగపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తొలత ఎంపిక చేసిన ఈ మూడు రంగాలకు చెందిన వారు క్యాంప్‌లకు హాజరై బ్యాంకులు అందంచనున్న కిసాన్ క్రెడిట్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.