Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలే శరణ్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సాయిబాబు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో తలపెట్టిన ఆ పార్టీ ద్వితీయ మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సాయిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటేష్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజాసమస్యలు మరింతగా పెరిగాయని చెప్పారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, అన్ని తరగతుల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు గుప్పించి ఓట్లు దండుకుని గద్దెనెక్కిన పాలకులు తదనంతరం మోసపూరిత విధానాలతో ప్రజలను విస్మరించి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నాయని మండిపడ్డారు.
తీర్మానాలివే
పోడు భూములకు పట్టాలివ్వాలని, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హెచ్పీసీ వేతనాలు అమలు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వర్తింపజేయాలని, సింగరేణి, జెన్కో ఆధారిత పరిశ్రమలు, ఎరువుల, బొగ్గు శుద్ధి, సిమెంటు పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఉప్పల్ నుంచి భూపాలపల్లికి రైల్వేమార్గం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ జిల్లా ఆఫీసులకు పక్కా భవనాలు నిర్మించాలని, పర్మినెంట్ అధికారులను నియమించాలని, జిల్లాలో కార్మిక, రిజిస్ట్రేషన్ కార్యాలాయలను ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో బీఈడీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలను నెలకొల్పాలని, మేడిగడ్డ, అన్నారం సింగరేణి, తాడిచర్ల బ్లాక్ కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, గడ్డిగానిపల్లి, దుబ్బపల్లి, కాపురం గ్రామాలను తరలించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం ఇచ్చి నివాసం కల్పించాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలని, అర్హులకు సామాజిక పింఛన్లు మంజూరు చేయాలని, అసంఘటిత కార్మికులకు కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను, ఆహార భద్రత చట్టాన్ని పటిష్టం చేయాలని, మహిళలు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలని, ఆర్టీసీ విద్యుత్ ఇంటి పన్ను విరమించుకోవాలని, జిల్లా సమగ్రాభివద్ధికి ఐదు వేల కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు చేయాలని, దళిత, గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని తీర్మానించారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిగా బందు సాయిలు
సీపీఐ(ఎం) జిల్లా మహాసభల సందర్భంగా జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శి గా బందులు సాయిలు, కార్యదర్శివర్గ సభ్యులుగా పొలం రాజేందర్, చెన్నూరి రమేష్, కంపేటి రాజయ్య, కిరణ్, జిల్లా కమిటీ సభ్యులుగా సకినాల మల్లయ్య, వెలిశెట్టి రాజయ్య, సోడి పావని, గుర్రం దేవేందర్, పసల వినరుకుమార్, రజినీకాంత్, రామస్వామి, సూదుల శంకర్ ఎన్నికయ్యారు.