Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల రమేశ్
కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవ తెలంగాణ సుబేదారి
పంచాయతీ కార్మికుల వేతనాలు పీఆర్సీ తరహాలో పెంచాలని సీఐటీయూ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల రమేశ్ డిమాండ్ చేశారు. సోమవారం పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హన్మకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 12,765 గ్రామ పంచాయతీల్లో 36 వేల మంది సిబ్బంది పారిశుద్ధ్య, నర్సరీలు, వాటర్ సప్లై, వీధి దీపాలు నిర్వహణ, పన్నులు వసూళ్లు, ఆఫీస్ నిర్వహణ తదితర పనులు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబర్ 51 ద్వారా పంచాయతీ కార్మికులకు 8500 రూ. ల వేతనాలు గా నిర్ణయించి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 500మందికి ఒక్కరు చొప్పున సేవలు అందిస్తున్న, పనిభారంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రస్తుతం 2021 జనాభా ప్రాతిపదికన పని చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం 15, 600 రూపాయల కనీస వేతనం ఇవ్వాలన్నారు. మల్టిపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబర్, బిల్లు కలెక్టర్లకు స్పెషల్ స్టేషన్ కల్పించాలని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు... ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బొట్ల చక్రపాణి, గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాయకులు బీ రమేశ్, ఆర్ సాంబయ్య, బరిగెల చంద్రయ్య, టీ నరేశ్, ఉప్పర రవి, బండి శంకర్, టీ చంద్రమౌలి తదితరులు పాల్గొన్నారు.