Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విధులకు హాజరుగానీ వారిపై చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ-నర్సంపేట
భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతగిరి రవి డిమాండ్ చేశారు. సోమవారం (సీఐటీయు) ఆధ్వర్యంలో సహాయ కార్మిక కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు అందజేసిన ధరఖాస్తులు పరిష్కరించకుండ రెండేండ్ల నుంచి పెండింగ్లో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. నర్సంపేట సహాయ కార్మిక కార్యాలయం దళారులుకు అడ్డగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎల్వో కార్యాలయానికి రాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడన్నారు. ఫలితంగా అనేక మంది కార్మికుల ధరఖాస్తులు పెండింగ్లో పడి పరిష్కారానికి నోచుకోలేదన్నారు. పలు మార్లు ఫోన్లో సంప్రదించగా ఫలితం లేకుండా పోయిందని, కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేయడానికి రావాలని కోరగా కార్యాలయంలోని ఓ ప్రయివేటు వ్యక్తికి ఇవ్వమని చెప్పడం కార్మిక అధికారి బాధ్యతారహిత్యానికి నిదర్శనమన్నారు. విధులకు హాజరు కానీ సహాయ అధికారిపై వెంటనే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్లో ఉన్న కార్మికుల ఎక్స్గ్రేషియా, ఇతర పథకాల ధరఖాస్తులను పరిష్కరించాలని లేకపోతే దశల వారిగా కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీఐటీయు మహిళా జిల్లా నాయకురాలు గుజ్జుల ఉమా, పట్టణ కార్యదర్శి లక్క సాయి బాబు, సహాయ కార్యదర్శి పసునూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి ఉపాధ్యక్షుడు రాయపురం రమేష్, కందికొండ రాజు, నాయకులు కొండి మల్లయ్య, ఎండీ.భాష, ఈశ్వరయ్య, రవ్వ విజయ, జానీ, సదానందం, ఆడెపు లక్ష్మి పాల్గొన్నారు.