Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం
మండలంలో మద్యం ఏరులై పారుతోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రాజు అన్నారు. మండలంలోని బెల్ట్‌షాపులను తొలగించాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సిండికేట్‌గా ఏర్పడి హోల్‌సేల్ కౌంటర్ పెట్టి అధిక ధరలకు మద్యం అమ్ముతున్న బ్రాందీ షాప్ వ్యాపారులపై చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలోని బృందం ఎక్సైజ్ సీఐ పకీరాకు బుధవారం వినతిపత్రం అందించారు. అనంతరం చిటమట రాజు మాట్లాడారు. బ్రాందీ షాపుల యజమానులు మండలంలోని అన్ని గ్రామాల్లోని వాడవాడలా బెల్ట్‌షాపులు ఏర్పాటు చేయించి యువతను మద్యానికి బానిసలు చేస్తున్నారని, అధిక మొత్తంలో దండుకుంటూ బ్లాక్ దందా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. బెల్ట్‌షాపుల వల్ల గ్రామాల్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, యువత ఆరోగ్యాన్ని నష్టపోతున్నట్టు చెప్పారు. మందుబాబులు ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారని తెలిపారు. మద్యం వ్యాపారస్తులు సిండికేట్‌గా ఏర్పడి హోల్‌సేల్ కౌంటర్ ఏర్పాటు చేసిన ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.20లు అదనంగా వసూలు చేస్తూ పేదలను లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. మండల కేంద్రంలోని రిటైల్ కౌంటర్లో ఏ బ్రాండ్ కూడా దొరకడం లేదని, బెల్ట్‌షాపుల్లో మాత్రం అమ్ముతున్నారని చెప్పారు. అయినా ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. అలాగే మంగపేట మండలంలో బ్రాండీ షాపులు లేకపోవడంతో ఏటూర్‌నాగారం నుంచి మంగపేటకు మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ప్రతిరోజూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. అలాగే మండల కేంద్రంలో కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి మండలంలోని మద్యం షాపుల్లో తనిఖీలు నిర్వహించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లోని బెల్ట్‌షాపులను మూయించాలని, మంగపేటకు మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి, ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పీఏసీఎస్ వైస్ చైర్మెన్ చెన్నూరి బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు వినరు, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ సర్దార్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.