Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనజీవన స్రవంతిలో కలవాలి
ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్
నవతెలంగాణ- ములుగు
మావోయిస్టులు అమాయక గిరిజనులను అవసరాల కోసం కొరియర్లుగా వాడుకొని అనంతరం ఇన్ఫార్మర్ల నెపంతో కిరాతకంగా హతమారుస్తున్నారని, అలాంటి వారికి గిరిజన ప్రజలు సహకరించొద్దని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆయన వివరాల ప్రకారం.. వెంకటాపురం మండలం కొండాపురానికి చెందిన కొరస రమేశ్, అదే మండలం తిప్పపురానికి చెందిన కురసం రమేశ్‌లు గతంలో మావోయిస్టు పార్టీకి కొరయర్లుగా పనిచేశారు. ఇటీవల(సోమవారం) వారు సీపీఐ (మావోయిస్టు) డీవీసీ, జేఎండబ్ల్యూపీ సుధాకర్ పిలుపుమేరకు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని భీమారానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడికి మిలీషియా సభ్యులు వచ్చి వారిని బంధించి కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి వారిని అక్కడే ఉంచి మరుసటి రోజు (21న) ఉదయం కొరస రమేష్‌ను అక్కడి నుండి వేరే ప్రదేశానికి తీసుకువెళ్లారు. కానీ కురసం రమేష్‌ను ఆ రాత్రి చర్ల మండలం పూసుగుప్ప గ్రామంలో వదిలేశారు. ఆ మరుసటి రోజు(22న) వెంకటాపురం పోలీస్ స్టేషన్ సరిహద్దు గ్రామమయిన ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన కొత్తపల్లి గ్రామం దగ్గర ఒక శవం ఉందని సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అనంతరం వారు ఆ మృతదేహాన్ని కొరస రమేష్‌గా గుర్తించారు. మావోయిస్టు పార్టీ వారు అతనిని పోలీస్ ఇన్ ఫార్మర్ గా భావించి క్రూరంగా ఇంటరాగేషన్ చేసి తుపాకీతో తలలో కాల్చి చంపారని ఎస్పీ తెలిపారు.
గిరిజన ప్రజలు ఎవరూ కూడా మావోయిస్టు పార్టీ వారికి సహకరించకూడదని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజన ప్రజలకు అందకుండా, ఈ ప్రాంత అభివద్ధిని అడ్డుకోవడం ద్వారా ప్రజలు పేదరికంలో మగ్గెలా చేయడం మావోయిస్టు పార్టీ సిద్ధాంతమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా మావోయిస్టు పార్టీ వారు హింసను విడనాడి లొంగిపోయి ఏజెన్సీ ప్రాంత అభివద్ధికి సహకరించాలని ఎస్పీ కోరారు.