Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పాలకులు వివక్ష పాటిస్తున్నారని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు విస్సంపల్లి సైదులు విమర్శించారు. మండలంలోని మునిగలవీడు గ్రామంలో ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రం ప్రతులను శనివారం దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడారు. మనుధర్మ శాస్త్రంతో అగ్రకులాలు అంటరానితనం, వివక్ష పాటిస్తున్నాయని చెప్పారు. వాటికి అడ్డుకట్ట వేసేలా రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. అధికార పార్టీలు ప్రజలకిచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అనేక మోసపూరిత హామీలు గుప్పించి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి తదనంతరం ప్రజలను విస్మరించిన పాలక పార్టీల తీరును ప్రజలు గుర్తించి పోరాటాల దిశగా పయనించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య, రామచంద్ర, కృష్ణ, రమేష్, రాములు, జి సైదులు, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం, దళిత మైనార్టీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్ర పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు పుల్ల మల్లయ్య, డీఎంఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు దూడపాక నరేష్ మాట్లాడారు. కార్యక్రమంలో ఏవైఎస్ జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్, జిల్లా సాంస్కతిక కార్యదర్శి జన్నే యుగేందర్, ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోల్కొండ సురేష్, మండల నాయకులు సరిగొమ్ముల రాజేందర్, కనకం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.