Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ
నవతెలంగాణ-కోల్బెల్ట్
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్లో కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయా సంఘల నాయకులు కంపేటి రాజయ్య, పసునూటి రాజేందర్, దేవదాస్ మాట్లాడారు. 9వ వేజ్ బోర్డు జీఓ 22 ప్రాదేశిక సూత్రాల ప్రకారం, 8 ఏండ్ల క్రితం సింగరేణి యాజమాన్యం ఒప్పందంలో సంతకాలు చేసిన ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని చెప్పారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాల్సి ఉండగా కార్మికులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం, ఏరియా జీఎంలు సింగరేణి వ్యాప్తంగా 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను వాడుకుంటూ పర్మినెంట్ కాకుండా అడ్డు తగులుతున్నారని విమర్శించారు. సింగరేణి కార్మికులతో కాంట్రాక్ట్ కార్మికులకు సమానంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కోల్ ఇండియాలో తరహాలో హైపవర్ కమిటీ వేతనాలు ప్రతినెలా 7లోపు చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు గృహ, వైద్య సదుపాయంతోపాటు పిల్లలకు ఉచిత విద్య, కుటుంబీకులకు హెల్త్ కార్డు ఇవ్వాలని, ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే రూ.15 లక్షలు బీమా, కరోనాతో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈనెల 9 నుంచి 11 వరకు సమ్మె చేసినా యాజమాన్యం పట్టించుకోకపోవడం యాజమాన్య కర్కశత్వానికి పరాకాష్ట అని చెప్పారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జేఏసీ ఆధ్వర్యంలో జనవరి 4 నుంచి ఆందోళనలు చేపడతామని, ఫిబ్రవరి 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.