Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
జిల్లా సమగ్రాభివృద్ధికి ఐక్యపోరాటాలు నిర్మిస్తామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి తెలిపారు. ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించిన పార్టీ జిల్లా మహాసభల్లో జిల్లా కమిటీని ఎన్నుకోగా ఆయన రెండోసారి కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట్రెడ్డి మాట్లాడారు. తీర్మానాలను వివరించారు. జిల్లాలో ప్రధానమైన పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామన్న ముఖ్యమంత్రి దరఖాస్తులు ప్రజల నుంచి స్వీకరించి విస్మరించాడని విమర్శించారు. అటవీ హక్కుల చట్టం-2005 అమలులో అనేక కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. పోడుభూముల సమస్యపై పార్టీ అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు. పోడు సాగుదారులందరికీ హకుపత్రాలిచ్చే వరకు పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు. జిల్లాలో గోదావరి నది 92 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుండగా ఏజెన్సీ మండలాలైన వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి మండలాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే గోదావరి జలాలు జిల్లా రైతాంగానికి అందించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేసి స్కీమ్ వర్కర్లు, ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం ఇతర రంగాల కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మిల్లర్ల దోపిడీని అరికట్టాలని, మహిళలపై దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలని, దళితులకు భూపంపిణీ చేయాలని, జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మహాసభలో తీర్మానించినట్టు తెలిపారు.
పార్టీ జిల్లా కమిటీ ఎన్నిక
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిగా తుమ్మల వెంకట్రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా బీరెడ్డి సాంబశివ, మహ్మద్ అమ్జద్పాషా, దబ్బకట్ల లక్ష్మయ్య, రత్నం రాజేందర్, జిల్లా కమిటీ సభ్యులుగా దావూద్, గ్యానం వాసు, వంక రాములు, పొదిల చిట్టిబాబు, కొప్పుల రఘుపతి, గపూర్ పాషా, తీగల ఆగిరెడ్డి, కుమ్మరి శ్రీను, రమాదేవి, గొంది రాజేష్ ఎన్నికయ్యారు. సమావేశంలో నాయకులు బోడ రమేష్, రత్నం ప్రవీణ్, కుమ్మరి సాగర్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.