Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కన్నాయిగూడెం
ప్రభుత్వ భూమిలో జీసీసీ ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ నిర్మాణం చేపట్టగా భూవివాదం చోటు చేసుకుంది. రెవెన్యూ, అటవీ శాఖల నడుమ రగడ మొదలైంది. పనులు చేపట్టిన కార్మికుల పట్ల అటవీ శాఖ అధికారులు దురుసుగా ప్రవర్తించి పనులను అడ్డుకున్నారు. అటవీ శాఖ అధికారుల ఓవర్‌యాక్షన్ చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జిల్లా అదనపు కలెక్టర్ హుటాహుటిన మండలాన్ని సందర్శించి వాస్తవాలను పరిశీలించి తహసీల్దార్‌తో కలిసి అటవీ శాఖ అధికారుల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా తమకు ఉపాధి కల్పించేలా ఏర్పాటు కానున్న పెట్రోల్ బంక్‌ను మోసపూరితంగా అడ్డుకుంటున్నారంటూ రైతులు, గ్రామస్తులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. త్వరలో ఈ పంచాయతీ జిల్లా కలెక్టర్ చెంతకు చేరనుందని తెలిసింది. ఈ క్రమంలో మండలంలోని ముప్పనపల్లిలో తలపెట్టిన పెట్రోల్ పంప్ నిర్మాణ స్థలం విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై 'నవతెలంగాణ' కథనం..
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) ఆధ్వర్యంలో మండలంలోని ముప్పనపల్లి గ్రామంలో పెట్రోల్ పంప్ ఏర్పాటుకు నిర్ణయించగా రెవెన్యూ శాఖ అధికారులు అందుకోసం సర్వే నెంబర్ 157/1లో 20 గుంటల భూమిని కేటాయించారు. గత నెలలోనే జీసీసీ ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ నిర్మాణ పనులు చేపట్టారు. 20 రోజుల పాటు మిన్నకుండిన అటవీ శాఖ అధికారులు సదరు స్థలం అటవీ శాఖ పరిధిలోకి వస్తుందంటూ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ప్రశాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఈనెల 6న పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు పెట్రోల్ పంప్ నిర్మాణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్‌ను కత్తిరించారు. కూలీలను నెట్టివేశారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు. దీంతో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి సదరు స్థలాన్ని పరిశీలించి తహసీల్దార్ దేవాసింగ్తో కలిసి అటవీ శాఖ అధికారుల నిర్వాకంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ కొనసాగుతోంది. రెండు ప్రభుత్వ శాఖల నడుమ వివాదం కావడంతో పోలీసులు ఏమీ చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్ పంప్ ఏర్పాటైతే తమ గ్రామ యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలగడమే కాకుండా పెట్రోల్ కోసం సుదూర ప్రాంతానికి వెళ్లాల్సిన సమస్య తప్పుతుందని ఆశించిన రైతులు, ప్రజలు రెవెన్యూ, అటవీ శాఖల తీరుతో విస్తుపోయారు. ఈనెల 24న జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కాగా ఈ పంచాయతీ త్వరలో జిల్లా కలెక్టర్ చెంతకు చేరనుందని తెలిసింది. ఏది ఏమైనప్పటికీ భూమి కేటాయింపు సమయంలో రెండు ప్రభుత్వ శాఖల అధికారులు సంయుక్త సర్వే చేయకపోవడం వల్లే సమస్య తలెత్తిందని మండల ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో పని చేసి సమస్యను పరిష్కరించి పెట్రోల్ పంప్ ఏర్పాటు దిశగా చొరవ చూపాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై వివరణ కోసం 'నవతెలంగాణ' యత్నించగా మండల స్థాయి అధికారులు అందుబాటులో లేరు.