Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్పంచ్ పై అవినీతి ఆరోపణలు
నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న సర్పంచ్
నవతెలంగాణ-శాయంపేట
దళిత కాలనీలో నెల రోజుల నుంచి సరిపడా నీరు రావడంలేదని, సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని కాలనీవాసులు గ్రామసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలికంగా ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయాలని సభ దష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ రవి హామీ ఇచ్చారు. స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం సర్పంచ్ కందగట్ల రవి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ నివేదిక చదివి వినిపించారు. త్రాగునీటిపై సమీక్ష నిర్వహిం చగా మిషన్ భగీరథ అధికారులు, కాంట్రాక్టర్లు సభకు హాజరు కాలేదని, సమస్యలెవ్వరికీ చెప్పాలని సాంబయ్య ప్రశ్నించారు. దళిత కాలనీలో నీటి సమస్యపై కాలనీవాసులు చిరంజీవి, మోహన్, కట్టయ్య, సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత బావి కనెక్షన్ ఇచ్చి నీటి సరఫరా చేయాలని, గ్రామ సభ లో పాల్గొన్న అందరూ దళిత కాలనీకి వచ్చి సమస్యను పరిష్కరించాలని మండిపడ్డారు. తాగునీటి సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని సర్పంచ్ రవి, కార్యదర్శి రాజశేఖర్ హామీ ఇచ్చారు.
గ్రామ సభలో వచ్చిన సమస్యలు పరిష్కరించడం లేదని, సమస్యలను గుర్తించాలని, వీధి దీపాలు వెలగడం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్టీపీ నాయకులు మారపెల్లి సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన శాఖలపై చర్చ కొనసాగింది. ఉప సర్పంచ్ సుమన్ మాట్లాడుతూ.. బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేశాననీ రెండుసార్లు బిల్లులు పెట్టాడని, టైమర్ లైట్ల కొనుగోళ్లలో లక్ష రూపాయలు అదనంగా బిల్లు పెట్టాడని సర్పంచ్ రవిపై ఆరోపించి గ్రామ సభలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే పనులు ఎలా చేస్తారని, బిల్లులు ఎలా చెల్లిస్తారని, తమకు తెలియకుండా తమ తీర్మానం లేకుండా ఇకముందు ఎలాంటి పనులు చేపట్టవద్దని వార్డు సభ్యులు గొట్టుముక్కల చక్రపాణి సభలో స్పష్టం చేశారు. తాను అవినీతికి పాల్పడినట్లు అయితే అధికారులకు ఫిర్యాదు చేస్తే సమగ్ర విచారణ చేపట్టి అవినీతి బయట పెడతారని, తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సర్పంచ్ రవి తెలిపారు. ఈ సమావేశంలో వార్డ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కోతుల బెడద నివారించాలి
గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, తన ఇంట్లోకి అవి చొరబడి ఆగమాగం చేశాయని, వాటి బెడదను నివారించాలని గొట్టుముక్కల సరోజన గ్రామ సభలో ఏడుస్తూ తెలియజేసింది. దీంతో గ్రామ ప్రజలు కూడా కుక్కల, కోతుల బెడద నుండి నివారించాలని సభ దష్టికి తీసుకు వచ్చారు. దీంతో స్పందించిన సర్పంచ్ కోతులను పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తే, పాలకవర్గం కమిటీకి అండగా ఉంటూ కోతులు పట్టించే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు.