Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతరకు 3845 బస్సులు
అన్నివేళలా అందుబాటులో పర్యవేక్షణ టీంలు
ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్
నవతెలంగాణ-తాడ్వాయి
వచ్చే ఏడాది ఫిబ్రవరి 16నుంచి 19వరకు నిర్వహించే మేడారం మహా జాతరకు వచ్చే సందర్శకులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీి) మునిశేఖర్ అన్నారు. మంగళవారం వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం విజరు భాస్కర్, డీవీఎం శ్రీనివాసరావులతో కలిసి ఆయన మేడారంలో వనదేవతలను దర్శించకున్నారు. అనంతరం మేడారం బస్టాండ్ ఆవరణలో జరుగుతున్న బస్టాండ్ భూమి చదును, క్యూలైన్ల పనులను, పార్కింగ్ స్థలాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సారి జాతరకు 3,845 ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 12 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా బస్సులు నడపనున్నట్టు పేర్కొన్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చే సందర్శ కులకు ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. మహాజాతరకు ఆర్టీసీ బస్సుల ద్వారా 20లక్షల మంది ప్రయాణం చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు.
మొత్తం 99ప్రత్యేక బస్సు పాయింట్ నుంచి భక్తులను మేడారానికి చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈ పాయింట్ల నుంచి 3845 ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించిందని తెలిపారు. ఒక్క వరంగల్ రీజియన్ నుంచే 2,250 ఆర్టీసీ బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మేడారంలో 40ఎకరాల స్థలంలో బస్సుల పార్కింగ్, బస్సుల మరమ్మతులకు షెడ్డు, కార్మికులకు వసతి, అధికారులకు వసతి, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు ఏర్పాటుతోపాటు ప్రయాణికులు బస్సులో తిరిగి వెళ్లేందుకు విశ్రాంతి తీసుకునేందుకు తగు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్య సేవలు అందించేందుకు ఆర్టీసీ తో పాటు, వైద్య ఆరోగ్య శాఖ వారిచే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయివేటు వాహనాల్లో వచ్చే భక్తులు నార్లపూర్ చింతల్ వద్ద వారి వాహనాలు పార్కింగ్ చేస్తారని, అక్కడి నుంచి గద్దెల వద్దకు ప్రజలు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా చేరవేయనున్నాయని తెలిపారు. మేడారం ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంతంలో సీసీ కెమెరాలు బిగించి కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయనున్నామని పేర్కొన్నారు. ఎలాంటి సందేహం లేకుండా మేడారం మహా జాతరకు సందర్శ కులు వచ్చి వనదేవతలను దర్శించుకొని ప్రశాం తంగా ఇంటికి వెళ్ళవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆర్ టి సి ఆర్ ఎం విజయ భాస్కర్, ఆర్టీసీ డివిఎం తోట శ్రీనివాస రావు, ఆర్టీసీ డీఎం మహేష్ కుమార్, ఈఈ సత్యనారాయణ, ఆర్టీసీ డివిజనల్ ఇంజనీర్ వి బుచ్చయ్య, ఏటూర్ నాగారం, తాడ్వాయి ఆర్టీసీ కంట్రోలర్ శంకర్, బాబా తదితరులు పాల్గొన్నారు.