Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం
నవతెలంగాణ-బయ్యారం
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య డిమాండ్ చేశారు. ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను గురువారం దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలకు నష్టం కలిగించేలా విద్యుత్ స్లాబ్ వ్యవస్థను ప్రభుత్వం మార్చబోతోందన్నారు. ఇక నుంచి నెలవారీగా విద్యుత్ ఛార్జీలను పెంచడానికి ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. విద్యుత్‌ను ప్రయివేట్ శక్తులకు కట్టబెట్టడం వల్లే దుస్థితి దాపురించిందని చెప్పారు. పాలకులు ఓవైపు కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రాయితీల రూపంలో కట్టబెడుతూనే మరోవైపు ప్రజలపై భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు అనేక రెట్లు పెరిగాయని చెప్పారు. ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించటానికి ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ, ప్రజాసంఘాల నాయకులు అనూరాధ, రామగిరి భిక్షమ్, మాదంశెట్టి నాగేశ్వర్రావు, బోనగిరి మధు, దొడ్డి తిర్మలేష్, ధారావత్ మంగీలాల్, కొదుమూరి వీరభద్రం, బాలమల్లు, రామన్న, కేస మునిందర్, మురళి, శేషు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడ : మండల కేంద్రంలో న్యూడెమోక్రసీ, ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దేశెట్టి రామచంద్రయ్య, బూర్క వెంకటయ్య మాట్లాడారు. విద్యుత్ ఛార్జీల పెంపును ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు తప్పమని స్పష్టం చేశారు. ప్రజలు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు బూర్క బుచ్చిరాములు, యాదగిరి యుగంధర్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు హచ్చ, లాలు, జామ్లా, రామచంద్రు, లక్ష్మయ్య, విజరు, సారన్న, రాంసింగ్, వెంకన్న, పిట్టల దేవేందర్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.